హర్షిల్ కిరణ్‌ను అభినందించిన జిల్లా కలెక్టర్
గుంటూరు వెస్ట్: గుంటూరు నారాయణ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న హర్షిల్‌ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఆమె చాంబర్‌లో అభినందించారు. హర్షిల్ కిరణ్ తీసిన ఛాయా చిత్రాలతో 2025 క్యాలెంబర్‌ను తయారు చేశారు. దీనిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హర్షిల్ తీసిన పక్షులు, అటవీ జంతువులు, ప్రకృతి రమణీయ చిత్రాలు చూసి అభినందించారు. జాతీయ స్థాయిలో చాయా చిత్ర పోటీల్లో వచ్చిన బంగారు పతకాన్ని కూడా ఆమె బాలుడి మెడలో వేశారు. కార్యక్రమంలో హర్షిల్ తండ్రి కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
31న చేబ్రోలులో జాబ్ మేళా
చేబ్రోలు: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 31న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. శ్రీదేవి శనివారం తెలిపారు. సిద్ధి వినాయక బజాజ్, అపెక్స్ సొల్యూషన్స్, ఇన్నోవాసోర్స్ కంపెనీలు హాజరవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐఐటీ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువతీ, యువకులు పాల్గొనాలని ఆమె కోరారు.
రైలులో తప్పిపోయి
తెనాలి వచ్చిన బాలిక
తెనాలి రూరల్: రైలులో తప్పిపోయి తెనాలి వచ్చిన బాలికను గుర్తించి బంధువులకు జీఆర్పీ పోలీసులు అప్పగించారు. నల్గొండ జిల్లా నకరికల్లు మండలానికి చెందిన 16 ఏళ్ల దోలూరి నిహారిక తప్పిపోయి డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో తెనాలి వచ్చింది. బాలికను ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసులు శుక్రవారం రాత్రి గుర్తించారు. బాలిక నుంచి వివరాలు కనుక్కొని వారికి సమాచారం అందించారు. బాలిక మేనమామ వెంకటరెడ్డి, బంధువులు శనివారం తెనాలి రాగా వారికి అప్పగించారు.
వేళంగణి వేడుకలకు
ప్రత్యేక రైలు
లక్ష్మీపురం: నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా వేళంగణి వేడుకలకు ప్రత్యేక రైలును కేటాయించినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం డాక్టర్ ప్రదీప్‌కుమార్ శనివారం రాత్రి తెలిపారు. రైలు నంబరు (07125) సికింద్రాబాద్ – వేళంగణి రైలు ఈనెల 30న సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు వేళంగణి స్టేషన్‌కు చేరుకుటుందని తెలిపారు. (07126) వేళంగణి – సికింద్రాబాద్ రైలు జనవరి 1న వేళంగణిలో రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10.40 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక రైలు నల్గొండ, మిరియాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, మాల్‌పాకం, కాట్పాడి, వేలూరు, తిరునామల్‌లై, విల్వుపురం, మీదుగా నాగపట్నం స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు.
బంగారం షాపులో చోరీ
పట్నంబజారు: బంగారం దుకాణానికి చెవిటి, మూగ వ్యక్తిలా వచ్చి ఆభరణాలు దోచుకుని పోయిన సంఘటనపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నంబజారులో రియాజుద్దీన్ నిజాం జ్యూయలరీ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం గుర్తు తెలియని వ్యక్తి తాను మూగ, చెవిటి అని సర్టిఫికెట్ తీసుకొచ్చి, ఆర్థిక సాయం కావాలంటూ షాపు నిర్వాహకులను అడిగాడు. ఈ సమయంలో తన వద్ద ఉన్న టవల్‌ను టేబుల్‌పై ఉన్న బంగారు ఆభరణాల బాక్సుపై వేసి చాకచక్యంగా వెంట తీసుకుని వెళ్లాడు. 208 గ్రాముల బంగారం విలువ రూ. 15 లక్షలు ఉంటుంది. లాలాపేట పోలీసులు, సీసీఎస్ విభాగం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment