మనోడి ప్రతిభ
ఏఐఐఎంఎస్ ప్రవేశ పరీక్షలో
చేబ్రోలు: ఢిల్లీ ఏఐఐఎంఎస్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) నిర్వహించిన సూపర్ స్పెషాల్టీ ప్రవేశ పరీక్షలో జాయింట్ రీప్లేస్‌మెంట్ అండ్ రీ కనస్ట్రక్షన్ విభాగంలో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన గాదె మను శశిధర్‌రెడ్డి రెండో ర్యాంక్ సాధించినట్లు కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. ఇండియాలోని నాలుగు ఎయిమ్స్ కళాశాలలు అయిన రుషికేశ్, రాయపూర్, బోపాల్, బెటానియాల్లో ఒక్కొక్క సీటు చొప్పున నాలుగు మాత్రమే ఉన్నాయి. రెండో ర్యాంక్ సాధించిన మను శశిధర్‌రెడ్డి ఈ నాలుగు కళాశాలల్లో ఒకదానిలో 2025 జనవరిలో ప్రవేశం పొందనున్నాడు.
చిన్నతనం నుంచి చదువులో చురుకు
చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కేసీ హైస్కూల్ హెచ్‌ఎం త్రిపుర సుందరరెడ్డి, లక్ష్మీ నాగేంద్రల కుమారుడు శశిధర్‌రెడ్డి చిన్నతనం నుంచి చదువులో రాణించి నేడు జాతీయ స్థాయిలో జరిగిన ప్రవేశ పరీక్షలోను రెండో ర్యాంక్ సాధించాడు. స్వాతంత్ర సమరయోధుడు గాదె సైరా చిన్నప్పరెడ్డి వంశంలోని 5వ తరానికి చెందిన వారు. పదో తరగతిలో 600 మార్కులకు గాను 584మార్కులు సాధించాడు. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఇంటర్‌లో బైపీసీలో విద్యనభ్యసించి 974మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంక్ సాధించాడు. ఎంసెంట్‌లో మొదటి ప్రయత్నంలోనే 553వ ర్యాంక్ పొంది గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. 2018–19లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నాడు. హైదరాబాద్ నిమ్స్‌లో ఉన్న తొమ్మిది సీట్లలో సెంట్రల్ కోటాలో మొదటి సీటు ఎంఎస్ ఆర్థోపెడిక్‌లో చేరాడు. 2023లో ఎంఎస్ ఆర్థోతో పాటు డీఎన్‌బీ ఆర్థోను పూర్తి చేశాడు.2023 పిబ్రవరిలో జరిగిన తెలంగాణా స్టేట్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్‌లో పేపర్ ప్రజేంటేషన్‌లో గోల్డ్‌మెడల్, క్విజ్‌లో ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. 2024 ఫిబ్రవరిలో కరీంనగర్‌లో జరిగిన తెలంగాణా స్టేట్ ఆర్థోపెడిక్స్ సర్జన్స్ కాన్ఫరెన్స్‌లో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్, సర్టిఫికెట్ అందుకున్నాడు. 2023 మే 1 నుంచి 5 వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన స్పినే వీక్ వరల్డ్ కాన్ఫరెన్స్‌లో పేపర్ ప్రజేంటేషన్‌లో ప్రతిభ చాటి మన్నన్నలు పొందాడు. జాతీయ స్థాయిలో జరిగిన ప్రవేశ పరీక్షలో రెండో ర్యాంక్ సాధించిన శశిధర్‌రెడ్డిని కొత్తరెడ్డిపాలెం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment