హద్దు మీరితే జరిమానాల మోత
కొత్త సంవత్సరంలో రోడ్డు భద్రత నిబంధనలు మారనున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానాల మోత మోగనుంది. ఇకపై వాహన యజమానులు జాగ్రత్త పడాల్సిందే ! రహదారి నిబంధనలను కఠిన తరం చేసేందుకు పోలీసు, రవాణాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇటీవల హైకోర్టు ధర్మాసనం నిబంధనలు సరిగా అమలు చేయడం లేదంటూ పోలీసు, రవాణాశాఖ అధికారులపై అక్షింతలు వేసింది. ఈ క్రమంలో నిబంధనలు పాటించని వాహనదారులపై కొరడా ఝుళిపించేందుకు పోలీసు రవాణాశాఖ
అధికారులు సిద్ధం కాబోతున్నారు.
పట్నంబజారు: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఈ ఏడాది జూన్ నుంచే నూతన రహదారి భద్రతా నియమాలు అమల్లోకి వచ్చాయి. అయితే, వాటిని అంత పక్కాగా అమలు చేయలేదనే చెప్పాలి. రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణ, హైకోర్టు ఆదేశాల అమలులో భాగంగా అధికారులు నిబంధనలను కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే హెల్మెట్ ధారణపై ప్రత్యేక డ్రైవ్‌లతో ముందుకు వెళుతున్న పోలీసు, రవాణాశాఖ అధికారులు ఇకపై పూర్తిస్థాయి నిబంధనలపై దృష్టి సారించనున్నారు. గతంలో మైనర్లు వాహనం నడిపితే చిన్నాచితక జరిమానాలతో సరిపోయేది. త్వరలో మైనర్‌లు వాహనాలు నడిపితే రూ. 25వేల జరిమానాతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేసి జైలుశిక్ష పడేలా చూడనున్నారు. మైనర్లు వాహనాలు నడిపితే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
వాహనదారులకు అవగాహన
కార్యక్రమాలు
నూతన సంవత్సరం జనవరి నుంచి ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఆటోవాలాలు, ద్విచక్ర వాహనాదారులకు అవగాహన కార్యక్రమాను కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాల వడ్డింపు మాత్రం తథ్యమేనని తెలుస్తోంది. ఇకపై వాహనదారులు జాగ్రత్తలు, నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గుంటూరు నగర ట్రాఫిక్ డీఎస్పీ ఎం. రమేష్ పర్యవేక్షణలో ఈస్ట్, వెస్ట్ ట్రాఫిక్ సీఐలు ఏ. అశోక్, సింగయ్యలు హెల్మెట్ ధారణపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు, భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
నిబంధనల ప్రకారం జరిమానాలు ఇలా....
లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే గతంలో రూ.500 జరిమానా విధించేవారు. ఇప్పుడు దాన్ని రూ.5,000కు పెంచనున్నారు.
రెడ్‌లైట్ ఉల్లంఘించి వాహనాలు నడిపితే రూ 500 జరిమానా పడుతుంది.
అతివేగం, ర్యాష్, స్నేక్ డ్రైవింగ్‌లు చేస్తే రూ 1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తారు.
రాంగ్ రూట్‌లో వాహనాన్ని నడిపితే రూ.5000 ఫైన్ విధిస్తారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం తాగి వాహనం నడిపితే) గతంలో రూ.2,300 వేలుగా ఉన్న జరిమానా, ఇప్పుడు ఏకంగా 10వేలకు పెంచగా, అమలు కూడా అవుతోంది. దీనితోపాటు ఒకటి లేదా రెండు రోజుల జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయి.
రేసింగ్, స్పీడ్ డ్రైవ్ చేస్తే రూ.5 వేలు వసూలు చేయనున్నారు.
హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం, సీట్ బెల్టు ధరించకుండా కార్లు నడిపితే రూ.వెయ్యి కట్టాల్సిందే. దీనికి తోడు మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు.
అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా వెళితే నిబంధనలు పాటించాలి, లేనిపక్షంలో రూ. 10వేలు జరిమానా, కేసు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ద్విచక్ర వాహనాల్లో త్రిబుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే రూ.2 వేల వరకు చలాన్లు రాస్తారు.
ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.2 వేలు జరిమానా చెల్లించాలి
వాహనదారుడికి కౌన్సెలింగ్ ఇస్తున్న ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్
వాహన యజమానులు
ఇక జాగ్రత్త పడాల్సిందే !
నూతన సంవత్సరం
నుంచి నిబంధనలు అమలు
పాటించకపోతే భారీ
జరిమానాలు
పోలీసులు, రవాణా శాఖ
సంయుక్తంగా కార్యాచరణ
ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి
వాహనాలతో రోడ్డు ఎక్కే ప్రతి ఒక్కరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలి. నూతన సంవత్సరంలో నిబంధనల అమలుపై దృష్టి సారిస్తున్నాం. ఇప్పటికే అధికారులకు పలు సూచనలు చేశాం. మైనర్లు వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమా దాలు జరుగుతుయని గుర్తించాం. ఇకపై జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తాం. జాతీయ రహదారులతో పాటు, వాహనదారులు సర్వీస్ రోడ్లును కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. మలుపులు, సర్కిళ్ల వద్ద నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నిబంధనలు పాటించకుంటే మాత్రం చట్టప్రకారం జరిమానాలు తప్పవు.
–కె. సీతారామిరెడ్డి, డీటీసీ, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment