సంతోషకర సమాజంతోనే ఆనంద జీవితం
ఏఎన్‌యూ : సమాజం సంతోషంగా ఉంటే మనం కూడా ఆనందమయ జీవితాన్ని గడుపుతామని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి .రమణ అభిప్రాయపడ్డారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పూర్వ విద్యార్థుల సంఘ సమావేశం శనివారం యూనివర్సిటీ డైక్‌మన్ ఆడిటోరియంలో నిర్వహించారు. సమావేశానికి సంఘం డైరెక్టర్ ఆచార్య జి.వి.ఎస్.ఆర్. ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ సమాజంలో అల్లర్లు, గొడవలు, కొట్లాటలు ఉంటే సుఖమైన జీవితాన్ని గడపలేమని తెలిపారు. ధన సంపాదన ముఖ్యమైనా దానికన్నా సమాజ హితానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తాను డిగ్రీ పూర్తి కాగానే జర్నలిజం మీద ఆసక్తి ఉండటంతో ఈనాడు పత్రికలో విలేకరిగా పనిచేశానని పేర్కొన్నారు. ఆ రోజుల్లో జర్నలిజం అభివృద్ధికి ఎంతో గౌరవం ఉండేదని సూచించారు. వృత్తి పట్ల నిబద్ధత ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిదని తెలిపారు. ఇన్‌చార్జి రెక్టార్ ఆచార్య కె. రత్న షీలా మణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి సాధించేందుకు ఎందరో సహకారం అందించారని పేర్కొన్నారు. ఉన్నత శిఖరాల వైపు పయనించిన ఎందరో పూర్వ విద్యార్థులు వర్సిటీకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘ సమావేశాలు నిరంతరం కొనసాగేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన
న్యాయమూర్తి ఎన్ వి.రమణ
Comments
Please login to add a commentAdd a comment