ప్రయాణం.. రప్రయాస!
ప్రమాదకరంగా
పెద్దమ్మగడ్డ బైపాస్ రోడ్
● గుంతలమయంగా రహదారి,
పనిచేయని సిగ్నళ్లు
● కనిపించని సూచిక బోర్డులు
● భారీ వాహనాలతో భయం భయం
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని పెద్దమ్మగడ్డ నుంచి కాకతీయ యూనివర్సిటీకి వెళ్లే జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. ఎక్కడ గుంతలున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు భయపడుతూ ప్రయాణిస్తున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా భారీ వాహనాలు రద్దీగా ఉండే జాతీయ రహదారికి ఇరువైపులా నివాసముంటున్న ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రహదారి వెంట సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసంపూర్తి పనులు..
సుమారు పదేళ్ల క్రితం కేయూ జంక్షన్ నుంచి పెద్దమ్మగడ్డ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటికీ నేటికీ అక్కడక్కడా అసంపూర్తి పనులే దర్శనమిస్తున్నాయి. మూడు కిలోమీటర్ల మేర ఉన్న బైపాస్ రోడ్‌లో రోడ్డు ధ్వంసమై గుంతలమయంగా మారింది. జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి
సిగ్నళ్లు పనిచేయక..
ములుగు నుంచి హనుమకొండకు వచ్చే దారిలో పెద్దమ్మగడ్డ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లు కొద్ది రోజులుగా పని చేయడం లేదు. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. మూడు దారుల నుంచి బస్సులు, లారీలతో రద్దీగా ఉండే ప్రదేశంలో సిగ్నళ్లు పనిచేయక వాహనదారులు, రోడ్డు దాటాలంటే జంకుతున్నారు. జంక్షన్‌లో రోడ్డు ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు సర్వసాధారణంగా మారినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇరుకు రోడ్డు.. ఇబ్బందికర రాకపోకలు
పదేళ్ల క్రితమే పెద్దమ్మగడ్డ బైపాస్‌రోడ్డు విస్తరణ జరిగినప్పటికీ రోడ్డు వెడల్పులో భాగంగా ఇళ్లు కోల్పోతున్న పెద్దమ్మగడ్డ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపడంలో అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలున్నాయి. దీంతో విస్తరణకు పెద్దమ్మగడ్డ ప్రజలు విముఖత చూపెట్టారు. దీంతో పెద్దమ్మగడ్డ జంక్షన్ నుంచి కేయూకు వెళ్లే దారిలో సుమారు 300ల మీటర్ల మేర రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇక్కడ భారీ వాహనాలు వెళ్లే సమయంలో స్థానికులు ఇతర వాహనదారులు భయంభయంగా గడుపుతున్నారు. ఐదేళ్ల క్రితం పెద్దమ్మగడ్డలో తెల్లవారుజామును ఓ ఇంట్లోకి భారీ లారీ చొచ్చుకు వెళ్లింది. ఇంట్లో నిద్రిస్తున్న వారిలో ఒకరు చనిపోగా.. కుటుంబసభ్యులు గాయాల పాలయ్యారు. ఇప్పటికైనా రోడ్డును విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment