కమిషనర్ గారూ.. కనికరించరూ..
వరంగల్ అర్బన్: క్షేత్ర స్థాయిలో సమస్యలతో సహవాసం చేస్తున్నామని, కనికరం చూపాలని పలు కాలనీలకు చెందిన ప్రజలు కమిషనర్ అశ్విని తానాజీ వాకడేకు విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో కమిషనర్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా పలు కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని, ఇబ్బందులకు పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం కమిషనర్ టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల పనితీరుపై సమీక్షించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీపీఎస్‌ల పనితీరు మెరుగుపడాలని హెచ్చరించారు. శానిటేషన్ పరిస్థితులు మెరుగయ్యేలా చూడాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 67 ఫిర్యాదులు రాగా.. అందులో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు, అనుమతులు లేని కట్టడాలపై అత్యధికంగా ఉన్నాయి. ఇంజనీరింగ్‌కు 7, హెల్త్–శానిటేషన్‌కు 7, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ) 9, టౌన్ ప్లానింగ్‌కు 35, మంచినీటి సరఫరా 9 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, హెచ్‌ఓ రమేశ్, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఎంహెచ్‌ఓ రాజేశ్ పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● భీమారం కాకతీయ నగర్‌లో డ్రెయినేజీలు లేక మురుగునీరు రోడ్డుపై పారుతోందని కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
● 41వ డివిజన్ విశ్వనాథ కాలనీలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయని కాలనీ వేల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కోరారు.
● 17వ డివిజన్ స్తంభంపల్లి, జానీపీరీలలో మిషన్ భగీరథ నల్లాల ద్వారా నీరు సరఫరా జరగడం లేదని ఆయా కాలనీలవాసులకు విన్నవించారు.
● 10వ డివిజన్ శ్రీ రాంనగర్, పద్మాక్షమ్మ కాలనీలో 30 ఫీట్ల రోడ్డు కొంత మేర ఉందని, మ రికొంత 20 ఫీట్లు ఉందని, డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
● హనుమకొండ శ్రీదేవి ఏషియన్ మాల్‌కు సమీపంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కొంత మేర నిర్మించారని వినతి పత్రం సమర్పించారు.
● హనుమకొండ బాలసముద్రం ఎదురుగా ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ రావుల కోమల కిషన్ ఫిర్యాదు చేశారు.
● ఎన్‌జీఓస్ కాలనీ రోడ్డులోని ఇందిర నగర్‌లో కల్వర్టు లేక రోడ్డంతా జలమయమవుతోందని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విన్నవించారు.
● బాలసముద్రంలోని శ్మశాన వాటికకు రెండో గేట్ లేనందున అసాంఘిక కార్యకాలపాలకు అడ్డాగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నిసార్లు అర్జీలిచ్చినా
పట్టించుకోవట్లేదు
కమిషనర్‌కు మొర పెట్టుకున్న
గ్రేటర్‌వాసులు
Comments
Please login to add a commentAdd a comment