కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్
బక్కి వెంకటయ్య
● కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం కోసం అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, 15 రోజుల్లో పరిష్కరించి నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో భూ, అట్రాసిటి సమస్యలపై రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ, ఇతర శాఖల అధికారులతో కమిషన్ బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో నమోదైన అట్రాసిటి కేసులు, వాటి పురోగతి వివరాలను డీసీపీలు రవీందర్, సలీమా, ఏసీపీలు తిరుమల్, దేవేందర్ రెడ్డి, తిరుపతి, కిశోర్ కుమార్.. కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. భూ వివాదాలకు సంబంధించిన కేసులు, అట్రాసిటి కేసుల పరిష్కారం ఎన్ని రోజుల్లో జరుగుతుందని హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఎంతమంది బాధితులకు పరిహారం అందిందనే వివరాలను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శ్రీలత వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పరిహారం విడుదలలో ప్రభుత్వ జాప్యంపై తాను మాట్లాడతానన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో మాట్లాడుతూ హసన్‌పర్తి మండలం మునిపల్లిలో దళితుల భూసమస్యకు సంబంధించి వారం రోజుల్లో నివేదికను కమిషన్‌కు అందజేయాలని, జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం, ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో నమోదైన మొత్తం 21 కేసులపై సంబంధిత తహసీల్దార్ల నుంచి ప్రాథమిక నివేదికలు అందాయని, వాటిపై 15 రోజుల్లో సమగ్ర నివేదికను కమిషన్‌కు అందజేస్తామని తెలిపారు. అంతకుముందు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు కలెక్టర్ ప్రావీణ్య మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేశ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు నునావత్ రాంబాబు నాయక్, రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్, జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, రడపాక పరంజ్యోతి జవహర్‌లాల్ నాయక్, రాజేందర్, సింగారపు రవిప్రసాద్, ఈవీ శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment