హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు..
రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లిలో వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ అంత్యక్రియలు మంగళవారం ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. హరీశ్‌ను కడసారి చూసేందుకు గ్రామంతో పాటు చుట్టూ పక్కల ప్రజలు, బాల్యమిత్రులు, సహచర ఎస్సైలు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. పది రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సిన కొడుకు జిల్లేడ్ చెట్టుతో పెళ్లి చేస్తుంటే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరోవైపు హరీశ్ తల్లి మల్లికాంబ.. 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు, తన కొడుకు మిత్రులను పట్టుకుని గుండెలవిసేలా రోదించింది. అంతిమయాత్రలో బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ములుగు ఎస్పీ శబరీశ్ వేర్వేరుగా ఎస్సై హరీశ్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సై కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
ముగిసిన ఎస్సై అంత్యక్రియలు
శోకసంద్రంగా వెంకటేశ్వర్లపల్లి
బాధిత కుటుంబీకులకు భూపాలపల్లి ఎమ్మెల్యే, ములుగు ఎస్పీ పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment