ఆరంభ శూరత్వం
– 8లోu
వరంగల్ అర్బన్: లే–ఔట్ స్థలాల క్రమబద్ధీకరణ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ప్రొసీడింగ్ కాపీల జారీ ప్రక్రియ ఎట్టకేలకు ఆరంభమైంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఐదు నెలలుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటి వరకు 2,300 ఫైల్స్ మాత్రమే క్లియర్ అయ్యాయి. 90 వేల దరఖాస్తులు రాగా.. దాదాపు 8 వేలు వెరిఫికేషన్ పూర్తయ్యాయి. స్థలాల యజమానులు రూ.3 కోట్ల మేరకు ఫీజులు చెల్లించగా.. ప్రొసీడింగ్‌లు జారీ అయ్యాయి. కాగా.. రూ.కోట్ల ఆదాయం సమకూరే ఈ ప్రక్రియలో ఆయా శాఖల అధికారులు బద్ధకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సవాల్‌గా మారిన పరిష్కారం
ఎల్‌ఆర్‌ఎస్ కోసం 1,00,989 దరఖాస్తులు నమోదు కాగా.. అందులో స్క్రూటీని చేయగా, 90 వేలుగా ప్రాథమికంగా అర్హత సాధించాయి. బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారులకు, సిబ్బందికి క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన సవాల్‌గా మారింది. ఐదు నెలల క్రితం ఈప్రకియ ప్రారంభించినప్పటికీ.. సిబ్బంది కొరత, ఇతర కారణాలతో అనేక అడ్డంకులతో ముందుకు సాగలేదు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెలాఖరులోగా క్లియర్ చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, నగర మేయర్, కమిషనర్లు వారానికోసారి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై సమీక్షిస్తున్నారు.
అదనపు బాధ్యతలు..
దరఖాస్తుల పరిశీలనకు టీపీబీఎస్‌లు, టీపీఎస్‌లు, వార్డు ఆఫీసర్లను 72 బృందాలుగా ఏర్పాటు చేశారు. ప్రతీ బృందం రోజుకు 20 చొప్పున పరిశీలించాలని, లేకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈక్రమంలో కొంత మంది ఇటీవల సమగ్ర ఇంటింటి కులగణన అదనపు బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. చాలా మంది స్థలాల యజమానులకు మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ స్పందించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. గతంలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్ని పరిష్కరించేవారు. చెరువుల సమీపంలో ఉంటే తిరస్కరించేవారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను పెద్దగా పట్టించుకునే వారు కాదు. హైదరాబాద్‌లో హైడ్రా కొరఢా ఝుళిపించడంతో.. వరంగల్‌కూ వాడ్రా వస్తుందని, తదుపరి తలనొప్పి ఉంటుందని భావించారు. ఈనేపథ్యంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖల సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేశారు.
ప్రచారం, చొరవ కరువు
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడంలో బల్దియా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సందేహాల నివృత్తికి ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలున్నాయి. రెగ్యులరైజేషన్ వల్ల యజమానులకు కలిగే ప్రయోజనాలపై చైతన్యం కల్పించలేకపోవడంపై ముందుకు రావడం లేదనే అభిప్రాయాలు నెలకొన్నా యి. పథకం ప్రారంభంలో దరఖాస్తుకు రూ.1,000 చెల్లించారు. తదుపరి ఎంత మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందోనని ఆందోళన నెలకొంది. ప్రొసీడింగ్ తీసుకుంటే కలిగే మేలుపై విస్తృత ప్రచారం కల్పించాలి. ఎల్‌ఆర్‌ఎస్ లేకుండా నేరుగా టీఎస్–బీపాస్‌లో ద్వారా పర్మిషన్ తీసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, ఆపై 33 శాతం అదనంగా పెనాల్టీ, స్థలాలకు రక్షణ తదితర అంశాలను ప్రజలకు వివరిస్తే భూ దరఖాస్తుదారులకు ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించాల్సి అవసరం ఉంది.
‘గ్రేటర్’ పరిధిలో సా..గుతున్న ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ
90 వేల దరఖాస్తులు..
వెరిఫికేషన్ పూర్తయినవి 8 వేలు
900 ప్రొసీడింగ్‌లు జారీ..
రూ.3 కోట్ల ఆదాయం
దరఖాస్తుదారులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం!
ప్రొసీడింగ్‌ల జారీ ఇలా..
స్థలాల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎల్–1, ఎల్–2, ఎల్–3 ప్రక్రియలుంటాయి.
300 గజాల్లోపు ఎల్–1లో టీపీబీఎస్, టీపీఎస్‌లు డాక్యుమెంట్ పరిశీలిస్తారు.
రెవెన్యూ శాఖకు చెందిన ఆర్‌ఐలు స్థలం స్థితిగతులు, వివాదాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఇరిగేషన్ ఏఈలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వంటి వాటిని పరిశీలించి ఓకే చేస్తారు. ఏవైనా లోపాలుంటే తిరస్కరణ లేక షార్ట్‌ఫాల్, ఆమోదం జరుగుతుంది.
ఎల్–2లో అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఎల్–3 లో డిప్యూటీ కమిషనర్ అన్నీ సరిగ్గా ఉంటే ఆమోదిస్తారు. ఫీజులు ప్రత్యేక అకౌంట్స్‌లోకి లేక డిజిటల్ చెల్లింపులు ఉంటుంది. తదుపరి ప్రొసీడింగ్ జారీ అవుతోంది.
300 గజాలకు పైన ఉన్న స్థలాలకు ఎల్–1 టీపీఎస్, టీపీబీఓలు, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది, ఎల్–2లో సిటీ ప్లానర్, ఎల్–3 కమిషనర్ లాగిన్‌లకు వెళ్తాయి. తదుపరి ఫీజుల స్వీకరణ తద్వారా ప్రొసీడింగ్‌లు జారీ అవుతాయి.
గత పక్షం రోజుల వ్యవధిలో 300 గజాల స్థలాల వెరిఫికేషన్ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటి వరకు 8వేల దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగా 2 వేల స్థలాల యజమానులకు ఫీజులు చెల్లించాలని సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment