అనాథ కవలలకు వివాహం | - | Sakshi
Sakshi News home page

అనాథ కవలలకు వివాహం

Published Sat, Feb 8 2025 7:45 AM | Last Updated on Sat, Feb 8 2025 7:44 AM

అనాథ

అనాథ కవలలకు వివాహం

జఫర్‌గఢ్‌: అమ్మలా ఆదరించిన అనాథాశ్రమం.. పెళ్లి వేడుకలతో సందడిగా మారింది. అనాథ కవలలకు వైభవంగా పెళ్లి చేసి అమ్మానాన్నలేని లోటును తీర్చారు ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య పుష్ప దంపతులు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం రేగడితండా గ్రామ శివారు టీబీతండాలో ఇన్నయ్య దంపతులు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజేత, శ్వేత అనే కవలలు అమ్మానాన్నలను కోల్పోవడంతో 2009లో ఈ ఆశ్రమంలో చేరారు. వీరిని పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పారు. శ్వేత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేయగా, విజేత బీఈడీ పూర్తి చేసింది. వీరికి ఇన్నయ్య దంపతులు పెళ్లి సంబంధాలు చూసి శుక్రవారం ఆశ్రమంలో ఘనంగా వివాహం జరిపించారు. ఈ వేడుకలకు వర్ధన్నపేట, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌తోపాటు వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

భార్యను హత్య చేసిన

భర్తకు జైలు

వరంగల్‌ లీగల్‌ : మద్యానికి బానిసై తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను కర్రలతో తలపై కొట్టి చంపిన నేరానికి హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఆలకుంట రాజుకు ఎనిమిది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విధిస్తూ హనుమకొండ రెండో అదన పు జిల్లా కోర్టు ఇన్‌చార్జ్‌ జడ్జి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్‌ రమేష్‌బాబు శుక్రవారం తీర్పు వెల్ల డించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. ధర్మసాగర్‌ మండలం ముప్పారం గ్రామానికి చెందిన వల్లె పు మల్లయ్య కుమార్తె గట్టమ్మను అదే మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఆలకుంట రాజు కు 2000 సంవత్సరంలో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రా జు డబ్బుల కోసం తరచూ భార్య గట్టమ్మను వేధించేవాడు. ఓసారి తీవ్రంగా కొట్టడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించుకున్నారు. అనంత రం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లినా.. రాజు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో కుటుంబ సమేతంగా వేములవాడ జాతరకు వెళ్లేందుకు రమ్మని గట్టమ్మ తల్లిదండ్రులను పిలిచింది. తండ్రి వల్లెపు మల్లయ్య తను రాలేనందున కూతురుకు కొంత డబ్బు ఇచ్చాడు. వేములవాడలో తాగడానికి డబ్బులు కావాలని రాజు భార్య గట్టమ్మను అడగ్గా.. ఇంటికి వెళ్లిన తర్వాత ఇస్తా దేవుని వద్ద తాగొద్దని చెప్పింది. జాతర నుంచి వచ్చిన తర్వాత గట్టమ్మ డబ్బులు ఇవ్వలేదు. దీంతో 2019 ఆగస్టు 7న మద్యం సేవించి వచ్చిన రాజు భార్య గట్టమ్మతో గొడవపడ్డాడు. కోపంతో మంచం పట్టి కర్రలతో గట్టమ్మ తలపై విపరీతంగా కొట్టాడు. స్పృహతప్పి రక్తమడుగులో ఉన్న గట్టమ్మ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు తీసుకొని పారిపోయాడు. స్కూల్‌ నుంచి వచ్చిన పెద్దకుమారుడు ఆలకుంట రమేశ్‌ రక్తమడుగులో ఉన్న తల్లిని చూసి భయంలో సమీప గ్రామమైన ముప్పారానికి వెళ్లి అమ్మమ్మ, తాతలకు విషయం చెప్పాడు. వారు వచ్చి చూడగా గట్టమ్మ మృతి చెంది ఉంది. అల్లుడు రాజు ఆచూకీ తెలియలేదు. మల్లయ్య ఫిర్యాదు మేరకు ధర్మసాగర్‌ పోలీసులు రాజుపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో తన భార్య చనిపోయిందని, పోలీసులు త న గురించి గాలిస్తున్నారని తెలిసి రాజు.. గ్రామ పెద్దల ద్వారా ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువుకావడంతో రాజుకు శిక్ష విధిస్తూ వెల్లడించింది. పోలీసు అధికారులు షాదుల్లా బా బా, ప్రవీణ్‌కుమార్‌ కేసును పరిశోధించగా లైజన్‌ ఆఫీసర్‌ పరమేశ్వరి పర్యవేక్షణలో కానిస్టేబుల్స్‌ అశోక్‌, రమేశ్‌, సుధాకర్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్‌ పక్షాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌రావు కేసు వాదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అనాథ కవలలకు వివాహం1
1/1

అనాథ కవలలకు వివాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement