![సీఎం కేసీఆర్‌ను కలిసిన ఓయూ అధ్యాపకులు (ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/1/30sec100-160061_mr.jpg.webp?itok=uYjo8iiZ)
సీఎం కేసీఆర్‌ను కలిసిన ఓయూ అధ్యాపకులు (ఫైల్)
ఉస్మానియా యూనివర్సిటీ: నూతన సచివాలయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్‌పై సీఎం కేసీఆర్ ఆదివారం చేసిన తొలిసంతకం పట్ల ఓయూలో విద్యార్థి, ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ అందులో యూనివర్సిటీలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు, బోధనేతర ఉద్యోగుల జాబితా లేకపోవడంతో నిరాశ చెందారు. ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని రాష్ట్ర అవతరణ ముందు, తర్వాత కేసీఆర్ అనేక సందర్భాల్లో హామీ ఇవ్వడంతో వర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగులు 9 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆదివారం తమ జాబితా లేదని తెలుసుకుని నిరాశలో మునిగిపోయారు.
25 ఏళ్లుగా కొనసాగుతున్నా...
ఓయూలో టీచింగ్, నాన్‌టీచింగ్, టైంస్కేల్ ఉద్యోగులు 25 ఏళ్లుగా కాంట్రాక్టుపైనే పని చేస్తున్నారు. ఎప్పటికై నా రెగ్యులర్ కాకపోతాయా అన్న ఆశతో రోజులు గడుపుతున్నారు. ఇలా ఎదురుచూస్తూ దాదాపు 25 మంది రిటైరవగా..30 మంది వరకు మరణించారు. ఇక 1600 వందల మంది నాన్‌టీచింగ్ స్టాఫ్, 300 మంది అధ్యాపకులు రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల రెగ్యులరైజ్ కోసం కాంట్రాక్టు అధ్యాపకులు ఓయూ నుంచి 2014 సెప్టెంబరులో, కేయూ నుంచి 2022 జులై నెలలో సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తులు, వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదు.
సీఎం పట్టించుకోవడం లేదు...
● రాష్ట్రం ఏర్పడిన తర్వత కాంట్రాక్టు అనే పదమే వినపడదని చెప్పిన సీఎం కేసీఆర్..అధికారం చేపట్టిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఓయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజా ఆవేదన వ్యక్తం చేశారు.
● కాగా యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు అధికారులు అడ్డుపడుతున్నారని వర్సిటీల కాంట్రాక్టు అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరుశురాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం అనేక సార్లు హామీ ఇచ్చినా అందుకు ఓయూ అధికారులు కార్యాచరణను చేపట్టక తమ జీవితాలు కాంట్రాక్టు ఉద్యోగాలతోనే ముగుస్తున్నాయన్నారు. పర్మినెంట్ అధ్యాపకులతో సమానంగా పనిచేసినా వేతనాల చెల్లింపులు, ఇతర బెన్‌ఫిట్స్‌లో వివక్ష చూపడం దారుణమన్నారు.
● వర్సిటీలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో పేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారు ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి వర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులను, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment