సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం అతిత్వరలో జరగనుంది. ఇందుకుగాను చర్చించాల్సిన అంశాలు..తదితరమైన వాటి గురించి చర్చించేందుకు మేయర్ విజయలక్ష్మి మంగళవారం అన్ని పార్టీల కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఇందుకు సిద్ధమయ్యారు.
కౌన్సిల్‌ను రద్దు చేస్తే పోలా?
జీహెచ్‌ంఎసీ కౌన్సిల్ సమావేశాలు దీర్ఘకాలంగా జరగనందున నగరంలోని పలు పనులు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమావేశం నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మల్కాజిగిరి కార్పొరేటర్ (బీజేపీ) శ్రవణ్ ఇటీవల హైకోర్టునాశ్రయించడం తెలిసిందే. సోమవారం పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. మునిసిపల్ పరిపాలనశాఖ స్టాండింగ్ కౌన్సిల్ కృష్ణారెడ్డి, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ రవీందర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశాలు నిర్ణీత వ్యవధుల్లో జరగక పోవడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల మేరకు మూడు నెలలకోమారు సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, వాటిని జరపక పోవడంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఒక దశలో అంతమాత్రం దానికి కౌన్సిల్‌నే రద్దుచేస్తే పోద్దిగా అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కనీసం పిటిషన్‌దారుకు సమాధానమైనా చెప్పండి అంటూ విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు.
అత్యవసరంగా..
హైకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉండటంతో కౌన్సిల్ సమావేశం నిర్వహణకు మేయర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అత్యవసరంగా మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల కార్పొరేటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సమావేశ తేదీని, అజెండాను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. తేదీ ఖరారు చేశాక కోర్టుకు వివరణ నివ్వవచ్చునని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల కోడ్ వంటి వాటివల్లే కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదని, అతి త్వరలో నిర్వహిస్తున్నామని కూడా తేదీతో సహ తెలుపుతూ వివరణ నిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మేయర్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మేయర్ వర్సెస్ కమిషనర్!
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్‌ల నడుమ నివురుగప్పిన నిప్పులా ఉన్న అభిప్రాయభేదాలు ఇటీవల వెలుగు చూశాయి. జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తాను ఎన్ని పర్యాయాలు ఆదేశించినా కమిషనర్ పట్టించుకోలేదని మేయర్ స్వయానా సీఎంను కలిసిన సందర్భంగా ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే సీఎం కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడటం తెలిసిందే. ఇకనైనా మేయర్–కమిషనర్‌ల మధ్య విభేదాలు సర్దుకొని కలిసి పనిచేస్తారా లేక కలహాలతోనే కాలం వెళ్లదీస్తారా అన్న చర్చ మొదలైంది. జీహెచ్‌ఎంసీకి సంబంధించి కమిషనర్‌తో నిర్వహించే సమావేశానికి తనను కూడా పిలవాలని మేయర్ విజయలక్ష్మి కోరడాన్ని మేయర్, కమిషనర్‌ల మధ్య అభిప్రాయభేదాలున్నాయనే అంశాన్ని మరింత బట్టబయలు చేసింది. కమిషనర్‌తో భేదాభిప్రాయాలే లేకుంటే ఆమె అలా కోరేవారు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, సమావేశాలే జరపనప్పుడు కౌన్సిల్‌నే రద్దుచేయొచ్చుగా అని హైకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో వీరిద్దరి ప్రయాణం ఇకపై ఎలా సాగనుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు..సమావేశాలు జరిగినా సభను నిర్వహించడంలోనూ మేయర్‌కు ఇదివరకున్న సౌలభ్యం ఇప్పుడు లేకుండా పోయింది. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తమ పార్టీయే కాగా, ప్రస్తుతం ప్రతిపక్షంగా మారింది. అప్పట్లో ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరించేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున.. చైర్‌లోఉండి ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉంటారో, లేక అనుకూలంగా ఉంటారో సమావేశం జరిగితే కానీ తెలుస్తుంది. జీహెచ్‌ఎంసీ మనుగడ సాగించాలంటే తగినన్ని నిధులు కావాలి. అందుకు ప్రభుత్వ సహకారం అవసరం కావడం తెలిసిందే. పార్టీనుంచి ఎలాంటి ఆదేశాలుంటాయో తెలియదు. దాంతోపాటు ప్రభుత్వం మారినందున సభ్యుల వ్యవహారం ఎలా ఉంటుందో కూడా తెలియదు. మొత్తానికి రాబోయే రోజుల్లో జీహెచ్‌ఎంసీలో విచిత్ర పరిస్థితులు, దృశ్యాలు కనపడనున్నాయి.
సీఎం సైతం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం జీహెచ్‌ఎంసీ చేయాల్సిన పనులు చేయకుండా ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని, కౌన్సిల్ సమావేశం ఎందుకు నిర్వహించలేదని తనను కలిసిన మేయర్‌తో అనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించడం అనివార్యంగా మారింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించి బడ్జెట్‌ను కూడా ఆమోదించక పోవడంతో బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహణకు కూడా అవకాశాలున్నాయి. స్టాండింగ్ కమిటీ లేనందున.. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశమున్నందున నేరుగా పాలకమండలిలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు అనుమతించాల్సిందిగా మేయర్ విజయలక్ష్మి సీఎంను కోర గా, ఆమేరకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన కమిషనర్ రోనాల్డ్‌రాస్‌ను ఆదేశించడం కూడా తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment