లైట్‌హౌస్‌ కు మరో మోడల్ మార్కెట్ | - | Sakshi
Sakshi News home page

లైట్‌హౌస్‌ కు మరో మోడల్ మార్కెట్

Published Wed, Oct 16 2024 1:04 PM | Last Updated on Wed, Oct 16 2024 1:57 PM

-

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఖాళీగా ఉన్న మరో మోడల్‌ మార్కెట్‌ను ప్రైవేట్‌ ఫౌండేషన్‌కు లీజుకిచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. నిరుద్యోగ యువతకు, ఆసరా లేని మహిళలకు తగిన నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే శేరిలింగంపల్లి జోన్‌ చందానగర్‌లో ఒక మోడల్‌ మార్కెట్‌ను లీజుకు పొంది శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న లైట్‌హౌస్‌ కమ్యూనిటీ ఫౌండేషన్‌కే ఖైరతాబాద్‌ జోన్‌లోని మల్లేపల్లిలో ఉన్న మరో మోడల్‌హౌస్‌ను లీజుకిచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. 

మల్లేపల్లి ప్రాంతంలో స్లమ్స్‌ ఎక్కువగా ఉన్నందున అక్కడి పేద కుటుంబాల్లోని యువత, మహిళలకు ఆయా రంగాల్లో తగిన నైపుణ్యశిక్షణ నందించడం ద్వారా ఉపాధి కల్పిస్తామనే హామీతో లైట్‌హౌస్‌ ఫౌండేషన్‌ ముందుకు రాగా, జీహెచ్‌ఎంసీ అందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నైపుణ్యశిక్షణ కేంద్రం ఏర్పాటుతో పరిసరాల్లోని దాదాపు 8,400 కుటుంబాలకు ఇది సదుపాయంగా ఉంటుందని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. శిక్షణకయ్యే వ్యయాన్ని లైట్‌హౌస్‌ ఫౌండేషన్‌ సీఎస్సార్‌ కార్యక్రమం కింద భరించనుంది. జీహెచ్‌ఎంసీతో కలిసి పీపీపీ విధానంలో అర్హులైన నిపుణుల ద్వారా నిరుద్యోగులకు తగిన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది.

కంప్యూటర్‌కు సంబంధించిన శిక్షణతోపాటు మహిళలకు ఉపకరించే బ్యూటీషియన్‌, టైలరింగ్‌ తదితర అంశాల్లో శిక్షణనిస్తారు. యువత ఉద్యోగాలు పొందేందుకు వారిని మానసికంగా తగిన విధంగా సిద్ధం చేయడంతో పాటు, దరఖాస్తు చేసే విధానం నుంచి ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాల్లోనూ తగిన గైడెన్స్‌ ఇస్తారని అధికారులు పేర్కొన్నారు. తొలుత ఏడాది వరకు మాత్రం ఒప్పందం కుదుర్చుకుంటారు. పనితీరు, ఫలితాల్ని బట్టి పొడిగింపులుంటాయి. మొదటి సంవత్సరం శిక్షణ పొందిన వారందరికీ నూరుశాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తేనే తదుపరి పొడిగింపులుండేలా జీహెచ్‌ఎంసీ షరతు విధించనుంది. 

ఒప్పందం కుదిరాక తొలి ఏడాది దాదాపు 600 మందికి శిక్షణ ఇవ్వాలనేది నిబంధన. వీరిలో 50 శాతం మంది మహిళలకు అవకాశం కల్పించాలి. ఈ ప్రతిపాదనలకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌కమిటీ ఆమోదం లాంఛనప్రాయమే. ఇటీవలే బొల్లారం మార్కెట్‌లోని మోడల్‌ మార్కెట్‌ను పీపీపీ కిందే, ఇవే నిబంధనలతో డాక్టర్‌ విజయ్‌కుమార్‌ దాట్ల ఫౌండేషన్‌కు ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ఆమోదం తెలిపింది. దాదాపు 40 మోడల్‌మార్కెట్ల నిర్మాణమైతే పూర్తిచేసిన జీహెచ్‌ఎంసీ,వాటిని వినియోగంలోకి తేవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఒక్కటొక్కటిగా మోడల్‌ మార్కెట్లను శిక్షణ కార్యక్రమాల పేరిట ప్రైవేటుకు లీజుల కిస్తుండటం ఏ పరిణామాలకు దారి తీస్తుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement