No Headline
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో దీపావళి సందడి మొదలైంది. ఎక్కడ చూసినా క్రాకర్స్ స్టాల్స్ అందుబాటులోకి వచ్చాయి. కొనుగోలుదారులు మాత్రం ధరలు పేలుతున్నాయని గగ్గోలుపెడుతున్నారు. దీపాలతో ఇంటిని అందంగా అలంకరించి, పిండి వంటలతో వంటింటిని ఘుమఘుమలాడించి, సాయంత్రం టపాసులు పేల్చి సంబరాలు చేసుకునే దీపావళికి అంతా సిద్ధమవుతున్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది 15 నుంచి 20 శాతం ధరలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
మార్కెట్‌లో కేజీ సేల్ అంటూ కొందరు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరికొన్ని దుకాణాల్లో మాత్రం క్వాలిటీకే మేం ప్రాధాన్యత ఇస్తున్నాం.. ధరలు ఎక్కువైనా కస్టమర్స్ మమ్మల్ని ఆదరిస్తారని అంటున్నారు. కేజీ సేల్‌లో టపాసులను తేలికై నవి, బరువైనవి రెండు రకాలుగా విభజించి కేజీ రూ.450 నుంచి రూ.1200 వరకు అమ్ముతున్నారు. ఈ కేటగిరీలో గత ఏడాది సుమారుగా రూ.350 నుంచి రూ.900 వరకు లభించేవి. ఫ్యామిలీ ప్యాక్స్ అంటూ కొన్ని రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటున్నాయి. అందులో చిన్నపిల్లలు, పెద్దలు అన్ని వయసుల వారికి అవసరమైన టపాసులను అందిస్తున్నారు. ఒక్కో ప్యాక్ రూ.2500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోంది. బాంబులతో పాటు విద్యుత్ దీపాలు, మట్టి ప్రమిదలకు మార్కెట్‌లో డిమాండ్ నెలకొంది.
కొత్త మోడల్ ఎల్‌ఈడీ విద్యుత్ సీరియల్ సెట్ దీపాలు ప్రత్యేక ఆఫర్లతో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. చిన్నప్లిలు కాల్చే తాళ్లు, మతా బులు, కాకరపువ్వొత్తుల, అగ్గిపెట్టెలు, ఇతర రకాల వస్తువుల కంటే మార్కెట్‌లో 1000 వాలా నుంచి 10,000 వాలా వరకు, హైడ్రోజన్, లక్ష్మీ బాంబులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్డీలు, బుల్లెట్ బాంబ్, మతాబులు, ఇతర వెలుగులు విరజిమ్మే రకాలు, పెద్ద శబ్ధం వచ్చే రకాల బాంబులకు గిరాకీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎమ్మార్పీకి కొంటే మోసపోతారు..
టపాసుల విషయంలో వాస్తవానికి వస్తువుల ప్యాకింగ్‌పై ఉన్న ఎమ్మార్పీ (గరిష్ట ధర) ధరలకు వినియోగదారులకు విక్రయించే ధరలకు ఏమాత్రం పొంతన ఉండటంలేదు. కొన్ని రకాల ప్యాక్‌లపై రూ.వేలల్లో ఎమ్మార్పీ ముద్రించినా ఆ ప్యాక్‌లు రూ.వందల్లోనే దొరుకుతున్నాయి. ఉదాహరణకు 10 థౌజండ్ వాలా ఎమ్మార్పీ సుమారుగా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటున్నాయి. అమ్మకానికి వచ్చేసరికి రూ.4,500 నుంచి రూ.8 వేలకు ఇస్తున్నారు. హైడ్రోజన్ బాంబుల (10 పీసెస్) బాక్సుపై ముద్రించిన ధర రూ.670 నుంచి రూ.950 వరకు ఉంటున్నా వీటిని మార్కెట్‌లో రూ.250 నుంచి రూ.350 మధ్యలో లభిస్తున్నాయి. ఎమ్మార్పీలో కనీసం 20 శాతం నుంచి 60 శాతం వరకు రాయితీపై అమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment