సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వివిధ రకాల అనుమతులపై నీటిపారుదల, రెవెన్యూ విభాగాల తనిఖీలు, క్షేత్రస్థాయి నివేదికల అనంతరమే హెచ్‌ఎండీఏ అనుమతులు లభించనున్నాయి. ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ పర్యవేక్షణలోనే అన్ని రకాల డాక్యుమెంట్లను పరిశీలించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉండగా, ఇక నుంచి రెవెన్యూ, నీటిపారుదల విభాగాల అనుమతులను కూడా తప్పనిసరి చేశారు. అంటే లే అవుట్‌లు, ఎల్‌ఆర్‌ఎస్‌లు, భవన నిర్మాణాలు తదితర అనుమతుల కోసం హెచ్‌ఎండీఏకు చేరే దరఖాస్తులను రెండంచెల్లో సమగ్రంగా పరిశీలించి అనుమతులు అందజేస్తారు.
ఇప్పటికే టీజీబీపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులపైన కూడా క్షేత్రస్థాయి పరిశీలనను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవైపు హెచ్‌ఎండీఏలో ఫైళ్ల పెండింగ్ జాబితా పెద్దఎత్తున పెరిగిపోతుండగా, తాజా నిబంధనల నేపథ్యంలో ఫైళ్ల పరిష్కారంలో మరింత జాప్యం చోటుచేసుకొనే అవకాశం ఉందని నిర్మాణ సంస్థలు, స్థలాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అనంతరం వందల కొద్దీ ఫైళ్లు పెండింగ్‌లో పడిపోయాయి. కొన్నింటికీ అవసరం ఉన్నా లేకున్నా ఇరిగేషన్, రెవిన్యూ విభాగాల నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) తప్పనిసరి చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అన్ని రకాల ఫైళ్లకు దరఖాస్తు దశలోనే రెవిన్యూ, ఇరిగేషన్ విభాగాల నుంచి క్లియరెన్స్‌ను కోరడం గమనార్హం.
రెండో దశలో ప్రణాళికా విభాగం..
● మొదట టీజీబీపాస్‌లకు అందిన దరఖాస్తులను రెవిన్యూ, ఇరిగేషన్ విభాగాల పరిశీలనకు పంపిస్తారు. ఇరిగేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, రెవిన్యూలో డిఫ్యూటీ తహసీల్దార్ లేదా అంతకంటే ఉన్నత స్థాయికి చెందిన అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చెరువులు, కుంటలు, తదితర నీటి వనరులు, ప్రభుత్వ భూములు, యూఎల్‌సీ వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు. అన్ని విధాలుగా ఎలాంటి ఆటంకాలు లేవని తేలిన తరువాత ఫైల్ ముందుకు వెళ్తుంది.
● రెండో దశలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో సంబంధిత జోన్‌కు చెందిన ప్లానింగ్ అధికారి మరోసారి ఫైల్‌ను పరిశీలిస్తారు. రెవిన్యూ. ఇరిగేషన్ విభాగాల నుంచి వచ్చిన క్లియరెన్స్‌పైన సంతృప్తి చెందితేనే ఫైల్ పైకి వెళ్తుంది.
● అనంతరం ప్లానింగ్ అధికారి నుంచి వచ్చే నివేది క ఆధారంగా ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలించి కమిషనర్ ఆమోదం కోసం ఫైల్‌ను అందజేస్తారు. ఇలా వివిధ దశలను దాటుకొని ఉన్నతాధికా రుల ఆమోదం పొందిన తరువాత మాత్రమే లే అవుట్‌లు, భవననిర్మాణాలు, ఎల్‌ఆర్‌ఎస్ తది తర అన్ని రకాల అనుమతులు లభిస్తాయి. షార్ట్‌ఫాల్స్ నెపంతో దరఖాస్తుల పరిశీలనలో కాలయాపనకు తావు లేకుండా వారం, పది రోజుల్లోనే అనుమతులను ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్న పద్ధతికి భిన్నంగా మరో రెండు విభాగాల అనుమతులను తప్పనిసరి చేయడం వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment