అగ్నిప్రమాదం
నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే
బొగ్గులకుంట ఉదంతంపై అగ్నిమాపక శాఖ నిర్థారణ
● టపాసుల విక్రయానికి ఇచ్చిన తాత్కాలిక లైసెన్స్ రద్దు
● ఘటనాస్థలిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
సాక్షి, సిటీబ్యూరో: బొగ్గులకుంటలోని పరాస్ బాణాసంచా విక్రయ దుకాణంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆ విభాగం డీజీ వై.నాగిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరాస్ దుకాణం నిర్వాహకులు బహిరంగ ప్రదేశంలో బాణాసంచా విక్రయం కోసం తాత్కాలిక లైసెన్స్ పొందారు. అయితే జీ ప్లస్ మెజనైన్ ఫ్లోర్‌తో నిర్మించిన కట్టడంలో వీటిని విక్రయిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. ఎలాంటి అగ్ని నిరోధక చర్యలు చేపట్టలేదని, ఈ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని తేల్చారు. లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించిన అగ్నిప్రమాదానికి కారణమైన పరాస్ బాణాసంచా దుకాణం నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు వారి లైసెన్స్ రద్దు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. బాణాసంచా దుకాణంతో పాటు పక్కనే ఉండి అగ్నికీలలు వ్యాపించడంతో దగ్ధమైన హోటల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ... దీపావళి నేపథ్యంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లోనే దుకాణాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఈ టపాసుల దుకాణం నిర్వహణకు అనుమతి లేదని, బహిరంగ ప్రదేశంలో విక్రయానికి అనుమతి పొంది, ఇలా షట్టర్లో దుకాణం ఏర్పాటు చేసి విక్రయించారని స్థానికులు రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు.
టపాసుల దుకాణాల్లో హైడ్రా తనిఖీలు
బొగ్గులకుంట ప్రమాదం నేపథ్యంలో రాజధాని వ్యాప్తంగా ఏర్పాటైన టపాసుల దుకాణాల్లో హైడ్రా బృందాలు సోమవారం నుంచి తనిఖీలు ప్రారంభించాయి. ఈ విభాగం ఆధీనంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) అధికారులు, సిబ్బంది ప్రాంతాల వారీగా దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నిర్వాహకులతో పాటు వినియోగదారులకూ తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తున్నారు.
బ్యాంకాక్‌కు థాయ్ ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు
శంషాబాద్: హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు థాయ్ ఎయిర్ ఏషియా విమాన సర్వీసులను ఆదివారం రాత్రి నుంచి ప్రారంభించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారం రోజుల్లో సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 11.25 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి బ్యాంకాక్‌లోని డాన్ మయూంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెల్లవారు జామున 4.30 గంటలకు చేరుకుంటుంది. ఈ సందర్భగా ఎయిర్‌పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణీకర్ మాట్లాడుతూ..పర్యాటక ప్రాంతమైన బ్యాంకాక్‌కు హైదరాబాద్ నుంచి నేరుగా సర్వీసులు పెంచడం ప్రయాణికులకు మరింత సౌలభ్యం పెరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment