రంగారెడ్డి జిల్లాకు కొత్త కలెక్టర్
నారాయణరెడ్డి నియామకం
● ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విభాగం కమిషనర్‌గా శశాంక బదిలీ
● ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు సైతం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా సి.నారాయణరెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన శశాంకను రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విభాగం కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కలెక్టర్‌గా నారాయణరెడ్డి మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
రైతు కుటుంబంలో పుట్టి..
నారాయణరెడ్డిది మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలోని శ్రీపురం. తండ్రి చెన్నారెడ్డి, నర్సింగమ్మ, నలుగురు అన్నలు, ఒక అక్క. నాన్న, సోదరులతో కలిసి వ్యయసాయం చేసేవారు. ఏడో తరగతి చదువుతున్నప్పుడే నాన్న చనిపోయారు. చదువు ఆపేద్దామని నిర్ణయించుకుని, పొలం బాట పట్టారు. ఆ తర్వాత అక్షరాలపై ఉన్న మమకారంతో మళ్లీ చదువుపై దృష్టిసారించారు. ఒకవైపు పొలం పనులు చేస్తూనే మరోవైపు చదువుకునే వాడు. పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. దీంతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూనే..ఇంటర్ పూర్తి చేశారు. ఉస్మానియాలో బీఈడీ, ఎంఎస్సీ చేశారు. కష్టాలెన్ని ఎదురైనా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. 2006 డీఎస్సీలో మహబూబ్‌నగర్ జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆ డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం చోటు చేసుకోవడంతో మక్తలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. పెద్ద చదువులు చదివి తక్కువ జీతానికి, చిన్న స్కూల్లో ఎలా పని చేస్తున్నావని అంతా ప్రశ్నించేవారు. అయినా ఆయన మాత్రం అధైర్యపడలేదు.
ఏడాది గడవక ముందే..
ఏడాది వ్యవధిలోనే జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మారడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి కలెక్టర్ హరీశ్‌పై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేయగా, ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించిన భారతి హోళికేరి ధరణి దరఖాస్తుల పరిష్కారంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మేడ్చల్ కలెక్టర్ గౌతం పోట్రుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి, ఆ తర్వాత శశాంకను పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన కలెక్టర్ శశాంకను తాజాగా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల కమిషనర్‌గా బదిలీ చేయడం కొసమెరుపు.
ఆర్డీఓల నియామకం
నర్సాపూర్ ఆర్డీఓగా పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఎన్.జగదీశ్వర్‌రెడ్డి కందుకూరు ఆర్డీఓగా నియమితులయ్యారు. జీఏడీ ఎస్టేట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ కె.చంద్రకళను చేవెళ్ల ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌గా, చీఫ్ ఎలక్షన్ ఆఫీస్‌లో పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఎన్‌ఆర్ సరిత షాద్‌నగర్ ఆర్డీఓగా నియమితులయ్యారు. జల్‌పల్లి, మీర్‌పేట్, బడంగ్‌పేట్, తుక్కుగూడ, ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్లకు స్థాన చలనం కల్పించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment