సొంత ఖాతా వాడలేదు! | - | Sakshi
Sakshi News home page

సొంత ఖాతా వాడలేదు!

Published Wed, Nov 20 2024 7:57 AM | Last Updated on Wed, Nov 20 2024 7:57 AM

-

హైదరాబాద్‌

సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లో ఉన్న ఐ ఫోన్లే పెట్టుబడిగా, కొంటాను–అమ్ముతానంటూ కథలు చెప్పి... తెలుగు రాష్ట్రాల్లోని 200 మంది నుంచి రూ.60 లక్షలు కాజేసిన బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ మరిశర్ల బాలాజీ నాయుడు బాధితుల నుంచి డబ్బు వసూలుకు తనదైన పంథా అనుసరించాడు. ఎవరికంటికీ కనిపించకుండా ఇంత మందిని కొల్లగొట్టిన అతగాడు ఏ ఒక్క సందర్భంలోనూ తన బ్యాంక్‌ ఖాతానో, మనీమ్యూల్స్‌కు చెందినదో వాడలేదు. కేవలం ఏటీఎం, క్యాష్‌ డిపాజిట్‌ మెషిన్‌ కేంద్రాల వద్దకు వచ్చిన వినియోగదారులను దీనికోసం వాడుకున్నాడు. బాలాజీ విచారణలో ఈ విషయం గుర్తించిన పంజగుట్ట పోలీసులు అవాక్కయ్యారు.

అసలు సమయంలో ఆ కేంద్రాల వద్దకు...

సెకండ్‌ హ్యాండ్‌ ఐ ఫోన్లు విక్రయించడానికి ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేసిన వారితో మాట్లాడి, తాను కొంటానంటూ డిలీట్‌ చేయించి... అవే వివరాలు తాను పోస్టు చేయడం ఇతడి నైజం అనే విషయం తెలిసిందే. వీటిని చూసి ఆకర్షితులైన వారితో బేరసారాల తర్వాత అసలు యజమానికి సంప్రదించే బాలాజీ ఆపై అసలు కథ ప్రారంభింస్తాడు. రకరకాల కారణాలు చెప్పి ఓ నిర్దిష్ట సమయంలో వాళ్లిద్దరూ ఓ ప్రాంతానికి వచ్చేలా చేసి వారితో ఫోన్‌ ద్వారా టచ్‌లో ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి బాలాజీ సైతం తనకు సమీపంలో ఉన్న ఏటీఎం, క్యాష్‌ డిపాజిట్‌ మెషిన్‌ కేంద్రానికి చేరుకుంటాడు. అక్కడకు వచ్చే వినియోగదారులతో సాంకేతిక కారణాల నేపథ్యంలో తన ఏటీఎం కార్డు పని చేయట్లేదని చెప్తాడు. తనకు బంధువుల నుంచి డబ్బు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని మీకు బదిలీ చేయిస్తానంటాడు. బాధితులకు ఫోన్‌ చేసి ఆ వినియోగదారుల నెంబర్‌ చెప్పి డబ్బు వారికి పంపేలా చేస్తాడు. ఆపై వారితోనే డ్రా చేయించి రూ.100 నుంచి రూ.500 వరకు వారికి ఇచ్చి మిగిలింది తీసుకుని ఉడాయిస్తాడు.

సిమ్‌కార్డులు మాత్రం అతడి పేరుతోనే...

ఈ కారణంగానే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అనేక మంది ఏటీఎం వినియోగదారులను అనుమానించి, వారిని ప్రశ్నించాల్సి వచ్చింది. బ్యాంకు ఖాతాల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకునే బాలాజీ సిమ్‌కార్డుల్ని మాత్రం తన పేరుతోనే తీసుకునేవాడు. తిరుపతి చిరునామాతో ఉన్న ఆధార్‌ కార్డు వినియోగించి ఇవి పొందాడు. ఆ అడ్రస్‌కు తాను వెళ్లనని, పోలీసులు వెళ్లినా తన వివరాలు దొరకవనే అలా చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. బాలాజీని సోమవారం అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఇతగాడిపై నగరంలోని వివిధ ఠాణాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనేక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. దీంతో బాలాజీ అరెస్టుపై ఆయా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పంజగుట్ట పోలీసులు నిర్ణయించారు.

మనీమ్యూల్స్‌ సహాయమూ తీసుకోలేదు

ఏటీఎం వినియోగదారుల ద్వారా వసూళ్లు

తనదైన పంథా అనుసరించిన ఎం.బాలాజీ

‘ఐ ఫోన్ల’ కేసులో జైలుకు వెళ్లింది ఇతగాడే

కస్టడీకి తీసుకోవాలని పోలీసుల నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement