అడ్రస్‌లేని ఆస్పత్రికి శంకుస్థాపన! | - | Sakshi
Sakshi News home page

అడ్రస్‌లేని ఆస్పత్రికి శంకుస్థాపన!

Published Fri, Dec 20 2024 7:02 AM | Last Updated on Fri, Dec 20 2024 7:02 AM

అడ్రస్‌లేని ఆస్పత్రికి శంకుస్థాపన!

అడ్రస్‌లేని ఆస్పత్రికి శంకుస్థాపన!

భూమి కేటాయించకుండానే శిలాఫలకాలు

ఆ ఆంతర్యం ఏమిటో..?

భూమిని కేటాయించకుండా ఆగమేఘాల మీద శిలాఫలకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విమర్శలు లేకపోలేదు. ఆ తర్వాత ఆయా శిలఫలకాలను అక్కడి నుంచి మున్సిపల్‌ ఆఫీసులకు తరలించడం విశేషం. ఇప్పటికే శంకుస్థాపనలు చేసిన భవనాలకు, రోడ్లకే దిక్కు లేదు. నిధుల లేమి సహా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఆయా నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలు అటు వైపు వెళ్లేవారిని వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. కేవలం నియోజకవర్గంలోని ఒకరిద్దరి రాజకీయ ఆదిపత్యం, లబ్ధి కోసమే ఇలాంటి అవగాహన లేని చర్యలు చేపడుతున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చర్యలను నియంత్రించాల్సిన జిల్లా అధికారులు సైతం ఏమీ చేయలేక మిన్నకుండిపోతున్నారు. ప్రజాప్రతినిధుల తొందరపాటు చర్యల వల్ల ప్రజల్లో తాము అభాసుపాలు కావాల్సి వస్తుందని ఆయా విభాగాల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏదైన భవనం నిర్మించాలంటే ముందు నిర్ధేశిత ప్రాంతంలో అవసరమైన విస్తీర్ణంలో భూమిని ఎంపిక చేస్తాం. ఆ తర్వాత ఓ శుభముహూర్తం చూసుకుని శంకుస్థాపన చేస్తాం. కానీ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు భూమిని ఎంపిక చేసి, కేటాయింపులు జరపకుండానే సాక్షాత్తు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలకు తోడు.. ప్రజాప్రతినిధుల తొందర పాటు చర్యల వల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తలపట్టుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.

అన్నింటికీ ఒకే చోట శిలాఫలకాలు

మహేశ్వరం నియోజకవర్గంలోని జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌సీఐ రోడ్డు సహా బడంగ్‌పేట్‌, తుక్కుగూడలో 15వ ఆర్థిక సంఘం నిధులతో పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ.1.43 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఆయా ఆస్పత్రి భవనాలకు అవసరమైన భూమిని మాత్రం నేటికీ ఎంపిక చేయలేదు. ప్రజాపాలన ఏడాది ఉత్సవాల్లో భాగంగా నవంబర్‌ 30న ఆయా భవనాలకు ఏకంగా శంకుస్థాపనలు చేయడం విశేషం. తుక్కుగూడలో ఓ రోడ్డుకు శంకుస్థాపన చేసిన చోటే.. ఆయా ఆస్పత్రి భవనాలకు సంబంధించిన శిలాఫలకాలను ఏర్పాటు శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన వెంటనే అనువైన భూమిని ఎంపిక చేయాలి. కానీ ఇవేవీ చేయకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఏకంగా శిలాఫలకాలు ఏర్పాటు చేసి, వాటికి శంకుస్థాపనలు చేయడం వివాదాస్పదంగా మారింది.

తుక్కుగూడ, ఆర్సీఐ, బడంగ్‌పేట్‌లలో వింత పరిస్థితి

ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై విమర్శల వెల్లువ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement