దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్ట్
బాలానగర్: సులభంగా డబ్బు సంపాదించేందుకు దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు యువకులను బాలానగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాలానగర్ ఏసీపీ హనుమంతరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన షేక్ సమీర్ ప్లంబర్‌గా పని చేసేవాడు. నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ అతడి స్నేహితుడు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు దారి దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న చింతల్ ప్రాంతానికి చెందిన సతీష్ డ్యూటీ నుంచి ఇంటికి తిరిగివెళుతుండగా ఉషా ఫ్యాన్ కంపెనీ సమీపంలో సమీర్, మహమ్మద్ హుస్సేన్ పథకం ప్రకారం సతీష్ బైక్‌ను ఢీకొన్నారు. అతను కింద పడిపోవడంతో అతడికి సహాయం చేస్తున్నట్లు దగ్గరికి వెళ్లి అతని మెడలోని 26.3 గ్రాముల గోల్డ్ చైన్, రెండు సెల్‌ఫోన్లు లాక్కున్నారు. సతీష్ వారిని అడ్డుకునేందుకు యత్నించగా అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి బంగారు గొలుసు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment