మోండా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం
● 5 దుకాణాలు దగ్ధం
● రూ.20 లక్షల ఆస్తినష్టం
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో గురువారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో 5 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు రూ.20 లక్షల మేర ఆస్తినష్టం వాటిళ్లింది. మార్కెట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున మార్కెట్‌లోని కొబ్బరికాయలు, కిరాణా దుకాణాల్లో మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, మార్కెట్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటను అదుపులోకి తెచ్చారు. కాగా అప్పటికే రెండు కొబ్బరికాయల దుకాణాలు, ఒక పూజా సామగ్రి, ప్లాస్టిక్ దుకాణం, కిరాణా షాప్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.20 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిళ్లిందని బాధితులు తెలిపారు. చలిమంట కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
అగ్ని ప్రమాదం విషయం తెలియడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటూ ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్లో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment