లారీ ఢీ కొని మహిళ దుర్మరణం
నాగోలు: బైక్‌పై రామోజీ ఫిల్మ్ సిటీకి వెళుతున్న జంటను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో ఓ యువతి మృతి చెందిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎల్‌బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రోహిత్‌కుమార్ పాట్లే మీర్‌పేట్, అన్నపూర్ణ కాలనీలో ఉంటూ నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన అతడి స్నేహితురాలు ప్రియాంక గాధే బుధవారం రోహిత్‌కుమార్ ఇంటికి వచ్చింది. ఇద్దరూ కలిసి గురువారం ఉదయం బైక్‌పై రామోజీ ఫిల్మ్ సిటీకి వెళుతుండగా ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ వారిని ఢీకొనడంతో ఇద్దరూ కింద పడ్డారు. లారీ చక్రాలు ప్రియాంక గాధే తల మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఎల్‌బీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రోహిత్‌కుమార్ పాట్లే ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment