84వ నుమాయిష్‌కు సర్వం సిద్ధం
అబిడ్స్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్) ఏర్పాటుకు ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జనవరి 1న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 84వ నుమాయిష్ ప్రారంభం కానుంది. 46 రోజుల పాటు ‘ఫిబ్రవరి 15) వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నిజాం కాలంలో 1938లో ప్రారంభమైన నుమాయిష్‌ను తిలకించేందుకు నగరవాసులే కాక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తారు.
2200 స్టాల్స్ ఏర్పాటు
ఎగ్జిబిషన్‌లో 2200 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల ఉత్పత్తులు ఈ స్టాళ్లల్లో కొలువుదీరనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య, ఆరోగ్య, కార్మిక, సమాచార, ఆర్‌బీఐ, అటవీశాఖ, జైళ్ల శాఖలతో పాటు పలు ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేసి సందర్శకులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తాయి. జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్‌లో రౌండ్ స్టాళ్లను తొలగించి స్క్వైయర్ స్టాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.
సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ..
ఎగ్జిబిషన్ నలుమూలలా 160 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. సందర్శకులను మధ్యాహ్నం 3 గంట నుండి రాత్రి 10.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ ఏడాది ఎంట్రీ ఫీజును రూ.10 పెంచారు. గతంలో రూ.40గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.50 గా నిర్ణయించారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ముమ్మర ఏర్పాట్లు
జనవరి 1 నుంచి ప్రారంభం
ఎంట్రీ టికెట్ ధర రూ. 10 పెంపు
160 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
సందర్శకులకు ఉచిత వైఫై సౌకర్యం
250 మందితో భద్రతా చర్యలు
కమాండ్ కంట్రోల్, వైఫై టవర్ ఏర్పాటు
ఎగ్జిబిషన్‌లో కొత్తగా కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసి అందులో పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఒకే చోట ఉండేలా చర్య లు తీసుకుంటున్నాం. ఫైర్, పోలీస్, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉండటం ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నా వేగవంతంగా పరిష్కారం అవుతాయి. సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుండడంతో వారి ఫోన్లకు సిగ్నల్ సమస్య ఏర్పడకుండా వైఫై టవర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ లోపలికి వచ్చే వారికి ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తాం. 84వ ఎగ్జిబిషన్‌లో సందర్శకులు సునాయాసంగా తిరిగేలా విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. మరుగుదొడ్లు, మంచినీటి వసతులు కల్పిస్తాం. సందర్శకుల సౌకర్యార్థం అనౌన్స్‌మెంట్ రూమ్‌ను అందుబాటులో ఉంచుతాం.
–నిరంజన్ ఎగ్జిబిషన్ సోసైటీ ఉపాధ్యక్షుడు
వలంటీర్లు, ప్రైవేట్
సెక్యూరిటీతో భద్రత
ఎగ్జిబిషన్‌కు దాదాపు 250 మంది వలంటీర్లు, ప్రైవేటు సెక్యూరిటీతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ లోపల, బయట సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచుతాం. ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం మెట్రోరైల్ సమయాన్ని రాత్రి వేళల్లో మరింత పొడిగించేందుకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి 1న ప్రదర్శనను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ హాజరవుతారు. 46 రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో వినోదాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.
– సురేందర్ రెడ్డి
ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment