న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రజా ఉద్యమం
సుల్తాన్‌బజార్: రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ అజీజ్ పాషా అన్నారు. ముస్లింల సంక్షేమం కోసం 2024 –25 బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం 30 నుంచి 40 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. గురువారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఆలిండియా మస్లిం మైనార్టీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎంఏ.సిద్దిఖీ, సనాఉల్లా హుస్సేన్‌తో కలిసి ఆయన మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ముస్లిం శ్మశాన వాటికలు దాదాపు కనుమరుగయ్యాయన్నారు. ఇందుకు నగర శివారులో 125 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూమిని కేటాయించాలన్నారు. ఇల్లులేని పేద ముస్లింలకు 100 గజాల స్థలం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్‌బోర్డు భూముల పరిరక్షణలో పాలకులు విఫలమయ్యారన్నారు. వక్ఫ్‌బోర్డు కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఉర్దూ విద్యార్థులకు పాస్ట్ మెట్రో స్కాలర్‌షిప్‌లను మంజూరు చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలన్నారు. ముస్లిం సంక్షేమం, అభివృద్ధి కోసం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో మునీర్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment