ఉదాసీనంగా ఉంటే ఊరుకోరు!
● రెసిడెన్సియల్ స్పేస్ కమర్షియల్‌కు వినియోగం
● ఫిర్యాదు చేసినా పట్టించుకోని కొందరు అధికారులు
● దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హైడ్రా బృందాలు
● కూల్చివేతలతో పాటు
బాధ్యులపై చర్యలకు సిఫార్సు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు నరకం చూపిస్తున్నాయి. గణనీయంగా పెరిగిపోతున్న వాహనాలతో పాటు వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్స్‌కు సరైన పార్కింగ్ వసతి లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం. దీనిపై దృష్టి పెట్టిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఫిర్యాదుల ఆధారంగా కూల్చివేతలు ప్రారంభించింది. దీంతో పాటు ఆ సమస్యకు మూలమైన, ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారుల అంశాన్నీ తీవ్రంగా పరిగణిస్తోంది. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత విభాగాలు, ప్రభుత్వంతో పాటు అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) సిఫార్సు చేయాలని నిర్ణయించింది. జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా నగరంలోని ట్రాఫిక్ స్థితిగతుల పైనా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు డీఆర్‌ఎఫ్ సిబ్బంది ట్రాఫిక్ వలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనతో పాటు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న అంశాలను హైడ్రా పరిగణలోకి తీసుకుంటోంది. నగరంలోని అనేక వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్స్ స్థితిగతుల్ని పరిశీలిస్తే... వాటిని లభించిన అనుమతులు, ప్రస్తుతం ఉన్న నిర్మాణాల మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఆయా భవనాల నిర్మాణాలు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ), ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చే వరకు సవ్యంగానే ఉంటున్నాయి. ఈ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సామూహిక, గృహ అవసరాలకు, పార్కింగ్ తదితర సౌకర్యాలకు కేటాయించిన స్థలం కమర్షియల్ స్పేస్‌గా మారిపోతోంది. అక్కడ చిన్న చిన్న.. ఒక్కోసారి బ్యాంకులు వంటి పెద్ద పెద్ద వాణిజ్య, వ్యాపార సంస్థలకు పుట్టుకువస్తున్నాయి. దీనిపై కన్నేసి ఉంచాల్సిన ప్రభుత్వ విభాగాలు మిన్నకుండిపోతున్నాయి. అసోసియేషన్లు, ప్లాట్లు, ఫ్లాట్ల యజమానులు ఫిర్యాదు చేసినా కొందరు అధికారులు పట్టించుకోవట్లేదు. దీనికి ప్రలోభాలు సహా అనేక కారణాలు ఉంటున్నాయి. ఇలా రెసిడెన్షియల్ నుంచి కమర్షియల్‌కు రూపుమారిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి పెట్టింది. వీటికి సంబంధించిన ఫిర్యాదులను ఈ విభాగం స్వీకరిస్తోంది. ఇలాంటి ఫిర్యాదుల వెనుక వ్యక్తిగత కారణాలు, కక్షలు, బెదిరింపు ధోరణులు వంటివి నిగూఢంగా ఉండే ఆస్కారం ఉందని హైడ్రా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఫిర్యాదునూ క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. నేరుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పని చేసే ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు రికార్డులను పరిశీలించడం ద్వారా అసలు విషయం తేలుస్తాయి. ఆపై హైడ్రా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఫిర్యాదుదారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం పాల్గొంటారు. దీని తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుని స్థానిక అధికారుల ద్వారా హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. ఇలాంటి ‘మార్పిడులు’ కొనసాగకుండా, పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారుల పైనా చర్యలు అనివార్యమని హైడ్రా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రికార్డుల ఆధారంగా ఈ వ్యవహారాలు చోటు చేసుకోవడానికి బాధ్యతులుగా తేలే అధికారుల పైనా చర్యలకు సిఫార్సు చేయాలని హైడ్రా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment