చైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? క్షీణిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి మాంద్యం ముప్పును తేనుందా? చైనా ఇకపై తన వైఖరిని మార్చుకోనుందా? ఇటువంటి ప్రశ్నలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిన్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇటువంటి పరిస్థితిలో చైనా తన ఉనికిని నేపాల్ నుండి శ్రీలంక వరకు విస్తరించడం, ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా, తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహ హస్తాన్ని కూడా చాచుతోంది. ఆర్థికవృద్ధికి ఇంతలా తాపత్రయ పడుతున్న చైనా విజయం సాధిస్తుందా?
చైనా ప్రాపర్టీ రంగంలో భారీ క్షీణతను ఎదుర్కొంటోంది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చైనా మాజీ సీనియర్ ఎన్‌బిఎస్ అధికారి హె కెంగ్ తెలిపారు. ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కానీ ఈ ఇళ్లలో మూడు వందల కోట్ల మంది ప్రజలు నివసించవచ్చని అన్నారు. డాంగ్-గ్వాన్ చైనాలోని ఒక నగరం. ఇక్కడ ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య చైనా జనాభా కంటే రెట్టింపులో ఉందని కెంగ్ తెలిపారు.
నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం దేశంలో 64.8 కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్థితిలో ఉన్నాయి. అంటే 90 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 72 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ డేటా ఆగస్టు 2023 నాటిది. ఈ ప్రాజెక్టులు పూర్తయినా, వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదని తెలుస్తోంది. అయితే అంతకుముందు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో లేదని అన్నారు. ఇలాంటి వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయని, జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్నదని పలు నివేదకలు చెబుతున్నాయి. జూలై 2023 నాటి గణాంకాల ప్రకారం 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 21.3 శాతం మంది యువత ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. అంటే నిరుద్యోగిత రేటు 21 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనాలో శ్రామిక శక్తి కొరత కూడా తలెత్తింది. సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల చైనాకు చాలా నష్టం వాటిల్లింది. జీడీపీతో పోలిస్తే చైనా అప్పు కూడా భారీగానే ఉంది. చైనాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం అది దాని మిత్ర దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నది. మరోవైపు దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గుతోంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం, ఎగుమతుల తగ్గుదల, కంపెనీలపై నిబంధనల కఠినతరం మొదలైనవన్నీ చైనాను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి.
తాజాగా చైనా తన విధానాలలో మార్పు కోరుకుంటుంది నేపాల్, అమెరికాతో చేతులు కలుపుతోంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఏడు రోజులపాటు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు అమెరికా, చైనాల దౌత్యవేత్తలు పరస్పరం కలుసుకుంటున్నారు. చైనా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతే యావత్ ప్రపంచంపై ప్రభావం పడుతుందన్న వాస్తవం అమెరికాకు ఇప్పుడు అర్థమైవుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే చైనాలో మాంద్యం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, సరఫరా గొలుసు ప్రభావితమవుతుంది. అయితే చైనా, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఎలాంటి ఫలితాలను చూపుతుందో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు?
Comments
Please login to add a commentAdd a comment