కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సేనల దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. వేల సంఖ్యలో సామాన్య పౌరులు మృతి చెందగా.. భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా.. రష్యా తీరుపై మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవతా కారిడార్, ఓడరేవు నగరమైన మరియుపోల్‌లోకి వెళ్లకుండా రష్యా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎందుకంటే అక్కడ వేలాది మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బలగాలు చంపేశాయని తెలిపారు. తాము అక్కడికి వెళితే రష్యా సైన్యం అసలు స్వరూపం బయటపడుతుందన్న కారణంగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. సాక్ష్యాలను దాచడంలో రష్యా విజయం సాధించిందని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. తమను చూసి రష్యా భయపడుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే, మరియుపోల్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బలగాలు శక్తివంతమైన వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 50 మంది పౌరులు మంటల్లో సజీవ దహనమయ్యారని సిటీ మేయర్ వాదిమ్ బాయ్‌చెన్‌కో ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరోవైపు.. రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా మాజీ ప్రధాని దిమిత్రి మిద్వేదేవ్, మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్, సెయింట్ పీటర్స్‌బర్గ్ గవర్నర్ అలెగ్జాండర్ బెల్గోవ్, రష్యా పొలిటికల్ లీడర్ మిఖాయిల్ మిషుస్టిన్‌పై అగ్ర రాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment