● వెంకట్‌కు ఎమ్మెల్సీఅభ్యర్థిగా అవకాశం ● హుజూరాబాద్, తారుపల్లిలో సంబరాలు
హుజూరాబాద్/కాల్వశ్రీరాంపూర్: ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుంది. ఈ మేరకు అధిష్టానం నుంచి కబురందగా.. ఈనెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 29న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బల్మూరి వెంకట్ ఉమ్మడి జిల్లాకు సుపరిచితుడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి వెంకట్ అమ్మమ్మగారి ఊరుకాగా.. 2021 ఉపఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పటి వరకు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను పట్టించుకునేవారు లేకపోవడంతో బల్మూరి వెంకట్ అన్నీతానై నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేశారు. 2023 సాధారణ ఎన్నికల వరకు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా కొనసాగారు. అధిష్టానం సూచన మేరకు పోటీనుంచి తప్పుకోగా, అధిష్టానం బల్మూరి సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో హుజూరాబాద్‌లో వెంకట్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
తారుపల్లిలో సంబురాలు
బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుండడంతో అమ్మమ్మగారి ఊరైన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. వెంకట్ తాత తారుపల్లి మాజీ సర్పంచు గోపాలకిషన్‌రావు(కాంగ్రెస్). గోపాల్‌కిషన్‌రావు పెద్దకూతురు పద్మ– మధన్‌మోహన్‌రావుల రెండో కుమారుడు వెంకట్. మధన్‌మోహన్‌రావు సివిల్ కాంట్రాక్టర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంకట్ తొమ్మిదో ఏటనుంచి తల్లి పద్మ అన్నీతానై డాక్టర్ చదివించింది. బల్మూరిని ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడంతో అమ్మమ్మ ఊరైన తారుపల్లిలో సర్పంచు బైరం రమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment