మీకు తెలియకుండా మీ అశ్లీల ఫొటోలు ఇన్‌స్టాలో! | Jagtial Police Arrest Man for Posting Indecent Content on Instagram | Sakshi
Sakshi News home page

మీకు తెలియకుండా మీ అశ్లీల ఫొటోలు ఇన్‌స్టాలో!

Published Wed, Jan 15 2025 10:11 AM | Last Updated on Wed, Jan 15 2025 10:55 AM

Jagtial Police Arrest Man for Posting Indecent Content on Instagram

మహిళ ఫిర్యాదుతో అసలు నిజాలు వెలుగులోకి..

ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను నిలిపివేసిన పోలీసులు

నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింపు

జగిత్యాలక్రైం: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ యువకుడు మహిళలు, యువతులను టార్గెట్‌ చేసుకున్నాడు. వారికి తెలియకుండా గోప్యంగా ఫొటోలు తీస్తూ వాటిని మార్ఫింగ్‌ చేసి వారి శరీరభాగాలు కన్పించేలా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాడు. పైగా వాటికి వచ్చే కామెంట్లకు లైక్‌లు, కామెంట్లు పెడుతూ మోసానికి పాల్పడుతున్నాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌ గ్రామానికి చెందిన బండారి శ్రావణ్‌ కొద్దిరోజులు దుబాయ్‌ వెళ్లాడు. 

అక్కడ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. జగిత్యాలలో సెల్‌పాయింట్‌ నిర్వహిస్తున్నాడు. టైస్‌ ఎన్‌ లెగ్గిన్స్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి అందులో మహిళలు, యువతుల నడుము నుంచి కిందిభాగం వరకు శరీర భాగాలు కన్పించేలా ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టింగ్‌లు పెడుతున్నాడు. ఇలా కొంతమంది తెలిసిన మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అరాచకానికి పాల్పడుతున్నాడు.

మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి...
ఓ మహిళ తాను వేసుకున్న డ్రెస్‌ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిందని ఆమె మిత్రులు తెలపగా.. ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశీలించింది. దీంతో అసలు విషయం బయటపడింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఆధారంగా శ్రావణ్‌ను గుర్తించి కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెలుగుచూసిన నిజాలు
పోలీసులు శ్రావణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి చూడగా బిత్తరపోయే నిజాలు వెలుగుచూశాయి. చాలా మంది మహిళలు, యువతుల ఫొటోలను ఆ యువకుడు మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టింగ్‌ పెట్టినట్లు గుర్తించారు. అతడి సెల్‌ఫోన్‌లో కూడా అశ్లీల చిత్రాలు బయట పడటంతో పోలీసులు శ్రావణ్‌ ఉపయోగించే హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, డీవీడీలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం వెలుగు చూడటంతో బుగ్గారం మండలంలోని పలు గ్రామాల్లో అతనితో పరిచయం ఉన్న మహిళలు, యువతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రావణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల పట్టణ సీఐ వేణుగోపాల్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement