పరిసరాలు ఇలాగేనా ఉండేది..?
ఇబ్రహీంపట్నం: ‘మోడల్ స్కూల్ ఉండేది ఇలాగేనా..? పరిసరాలు ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. కనీసం శుభ్రం చేయకుంటే విద్యార్థుల పరిస్థితి ఏంటీ..’ అంటూ కలెక్టర్ సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం కనిపించడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండర్లు సరిగా లేరని ఉపాధ్యాయులు తెలపగా.. తహసీల్దార్, ఎంపీడీవోలు వచ్చి శుభ్రం చేస్తారా..? అంటూ మండిపడ్డారు. అవసరమైతే విద్యార్థులతో ఒక్కరోజు శ్రమదానం వంటి కార్యక్రమం చేపట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. రేకులషెడ్డులోనే వంట చేస్తున్నామని, గది నిర్మించాలని నిర్వాహకులు కోరగా.. అంచనాలు రూపొందించాలని ఎంపీడీవో చంద్రశేఖర్‌కు సూచించారు. ఈజీఎస్ నిధులు రూ.2.50లక్షలతో అంచనాలు తయారుచేశామని ఎంపీడీవో పేర్కొన్నారు. బాలికల హాస్టల్ సమీపంలో ఈద్గా ఉండడం.. హాస్టల్‌కు ఒకవైపే ప్రహరీ ఉండడంతో వెంటనే నిర్మాణం చేపట్టాలని ఆర్డీవో శ్రీనివాస్‌కు సూచించారు. హాస్టల్ గదుల వెంటిలేటర్లకు జాలీలు లేకపోవడంతో కోతులు చొరబడుతున్నాయని వార్డెన్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. జాలీలు బిగించాలని తహసీల్దార్ ప్రసాద్‌ను ఆదేశించారు. వర్షకొండలో నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్‌ను పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఈవో రాము, స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, పంచాయతీ రాజ్ ఈఈ రెహమాన్, డీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్, ఎంపీడీవో వచ్చి శుభ్రం చేస్తారా..?
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment