జోరందుకున్న వరి నాట్లు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యాసంగి వరి నాట్లు మొదలయ్యాయి. నార్లు పోసి 20 నుంచి నెల కావడంతో రైతులు నాట్లలో నిమగ్నమయ్యారు. కూలీల సమస్య తీవ్రం కావడంతో కొందరు రైతులు మధ్యవర్తుల ద్వారా పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. మరికొందరు నాట్లు వేసేందుకు వెళ్లే మహిళాగ్రూపులకు గుత్తాకు ఇస్తున్నారు.
2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు
జిల్లాకు ఓ వైపు ఎస్సారెస్పీ నీరు వస్తుండడంతో వరదకాల్వకు తూములు, మోటార్లు బిగించి పొలా లకు అందిస్తున్నారు. మరోవైపు బావులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉండటంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వ్యవసాయ అధికా రుల అంచనా ప్రకారం ప్రస్తుత యాసంగిలో కనీ సం 2.50 లక్షల ఎకరాలకు పైగా వరి సాగవుతోందని అంచనా. సాగునీరు పుష్కలంగా ఉండటం.. 24 గంటల ఉచిత కరెంట్ వస్తుండడంతో వరి వైపే మొగ్గుచూపుతున్నారు. రైతులందరూ ఒకేసారి నాట్లు వేస్తుండటంతో కూలీల కొరత ఏర్పడింది. ఎకరాకు కనీసం ఎనిమిది మంది మహిళలు నాటు వేసేందుకు.. ఇద్దరు మగ కూలీలు నారు వేసేందుకు అవసరం. ఇలా ఒక్క గ్రామంలోనే కనీసం నాలుగైదు వందల మంది కూలీల అవసరం ఉంటుంది.
కూలీలకు ముందే అడ్వాన్సులు
నాటు వేసేందుకు కూలీలకు రైతులు ముందే అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. నాటు వేసే కూలీలకు గతేడాదితో పోల్చితే రూ.100 వరకు పెరిగింది. కూలీలను ఇంటి నుంచి పొలం వద్దకు తీసుకెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. నాట్లు ఆలస్యమైతే పంట సరిగా దిగుబడి రాదు. ఈ క్రమంలో ఎంత ఖర్చయినా నాట్లు వేసేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మధ్యవర్తులు పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి నాట్లు వేసేందుకు కూలీలను రప్పించారు. దళారీ ఖర్చుతో కలిపి ఆ కూలీలు ఎకరాకు రూ.4 నుంచి 5వేల వరకు తీసుకుంటున్నారు.
రైతులను వేధిస్తున్న కూలీల కొరత
ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్న వైనం
జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు
Comments
Please login to add a commentAdd a comment