పందేనికి
సంక్రాంతి పందేలకు సిద్ధమవుతున్న కోడి పుంజులు...!
● ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన పుంజులు..
● రహస్య ప్రాంతాల్లో పోటీలు
● రూ.లక్షల్లో చేతులు
మారే అవకాశం
జనగామ: పౌరుషానికి ప్రతీకగా నిలిచే కోడి పుంజులకు లభిస్తున్న యోగం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. సంక్రాంతికి పది రోజుల ముందు నుంచే పందెం కోళ్లకు మర్యాదలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తీసుకు వస్తున్న కోడిపుంజులకు ‘మర్యాద’ చేస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నాయి. బతుకు దెరువు కోసం వలస వెళ్లిన వారిలో కొందరు..పండుగ సమయంలో ఇంటికి వచ్చి..పందేల పేరుతో జేబులు గుల్లా చేసుకుంటున్నారు.
ప్రత్యేక శిక్షణ
కోడి పందేలకు సిద్ధం చేస్తుంటే ఆషామాషీ కాదు. ఇది ఒకరమైన కళ. ప్రావీణ్యులైన వ్యక్తులు వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పందేనికి సిద్ధం చేసే కోడిపుంజును ఉదయాన్నే ఎక్సర్ సైజ్ లాంటి చేయించడం, పందెంలో ఆయాస పడకుండా ముందుగానే తర్పీదునిస్తున్నారు. నిత్యం కోడిగుడ్డు, బాదం, పిస్తా పప్పులు, సాయంత్రం రాగులను ఆహారంగా ఇస్తారు. ఒక్క పుంజుకు నెల ఖర్చు రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే పందెం కోళ్లు అనుభవిస్తున్న దర్జాకు అద్దం పడుతుంది.
పందేలకు ముహూర్తాలు
మానవులకే కాదు కోడిపుంజుల్లో జాతులు, వాటి జాతకాలు చూసే వారు కూడా ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా కుక్కుట శాస్త్రం ఉంది. కోడి జాతిని బట్టి ఏ దిక్కుకు ఎలా వెళ్లాలి.. ఏ నక్షత్రం ముహూర్తంలో వెళ్లాలి అనేది చూసుకుని పందెం రాయుళ్లు పుంజులను బరిలోకి దింపుతారు. కాకి, డేగా, రఫంగి, అబ్రాస్, కక్కిరాయి వంటి పేర్లతో పిలిచే పందెం కోళ్లకు ఒక్కో నక్షత్రంలో గెలుపు ఉందని నమ్ముతారు.
సై
ఒక్కో కోడికి రూ.15వేల నుంచి రూ.40వేలు
కోడి పందేల్లో తమ పౌరుషాన్ని చూపించే పందెం కోళ్లకు ఆకాశమంత ధర పలుకుతుంది. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందేలకు పందెం రాయుళ్లు సన్నద్ధమవుతున్నారు. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువగా పందెం కోళ్లను తీసుకు వస్తున్నారు. వీటి ధర రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతున్నాయి. వీటి పెంపకం కూడా ఒక రకమైన వ్యాపారంగా మారిపోయింది. జనగామ జిల్లాలోని తరిగొప్పుల, నర్మెట, బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, చిల్పూరు తదితర మండలాల పరిధిలోని శివారు ప్రాంతాల్లోని తోటలు, మైదానాలు, ఇటుక బట్టీలు, తదితర ఏరియాల్లో కోడి పందేల నిర్వ హణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పుంజు జాతి, వాటి సంతతి, గత చరిత్ర, సైజును బట్టి ధర నిర్ణయిస్తున్నారు. పందేలు కూడా రూ.లక్షల్లో ఉంటాయి. వేల రూపాయల నుంచి లక్ష వరకు పందెం కాసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కోడి పందేలపై పోలీసులు ముందస్తు నిఘా ఉంచడంతో మూడోకంటికి తెలియకుండా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment