ఐదేళ్లూ ఆగమాగమే..!
ఎన్నో ఆశలు, ఆశయాలతో కౌన్సిల్‌లో అడుగుపెట్టిన పాలక మండలి.. వాటిని సాకారం చేసుకోకుండానే పదవీ కాలం ముగిసిపోనుంది. వార్డుల అభివృద్ధికి హామీలు ఇచ్చి గెలిచిన కౌన్సిలర్లు.. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించలేక పోయారు.. సమావేశాల్లో తమ గళాన్ని వినిపించినా అవినీతి, అక్రమాలు, నిధుల లేమి.. సభ్యులపై వివక్ష.. అవరోధాలుగా మారాయి. రాజకీయ పరిణామాల్లో చోటుచేసుకున్న మార్పులు మరో కారణంగా చెప్పవచ్చు.
జనగామ పురపాలిక ప్రస్తుత పాలక మండలి 2020 జనవరి 27న ప్రమాణ స్వీకారం చేసింది. ఐదేళ్ల పదవీ కాలం ఈనెల 27వ తేదీతో ముగియనుంది. అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ నుంచి 13, కాంగ్రెస్–10, బీజేపీ–4, స్వతంత్రులు ముగ్గురు కౌన్సిలర్లుగా గెలుపొందారు. రాజకీయ పరిణాల నేపథ్యంలో స్వతంత్రులు, పలువురు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు బీఆర్‌ఎస్‌లో చేరగా.. కాలక్రమేనా ఇందులో ఒకరిద్దరు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. 2020లో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి పోటీ ఉన్నప్పటికీ.. నాటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విజ్ఞప్తి మేరకు చైర్‌పర్సన్‌గా పోకల జమున లింగ య్య, వైస్ చైర్మన్‌గా మేకల రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.
గాడితప్పిన పాలన
పురపాలిక పాలక మండలి పాలన గాడి తప్పిందనే విమర్శలున్నాయి. సాఫీగా సాగిన సర్వసభ్య సమావేశం మచ్చుకు ఒక్కటి కూడా కనిపించదు. వార్డులకు నిధులు రావడం లేదని కొందరు.. వార్డుల్లో శానిటేషన్ సమస్య కారణంగా ప్రజలకు ముఖం చూపించలేక పోతున్నామని మరికొందరు.. తమకు కనీస గౌరవం ఉండడం లేదని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మెజారిటీ సభ్యులు ఆవేదన వెలిబుచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. మున్సిపాలిటీలో కొందరు దిగువ స్థాయి.. ఔట్ సోర్సింగ్ సిబ్బందిదే పెత్తనం ఉండగా.. వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ అధికారులతో నెట్టుకువస్తున్నారు. చేతులు తడడపనిదే ఫైల్ కదిలే పరిస్థితి లేదు.. ఈ విషయమై కౌన్సిలర్లు అనేక సమావేశాల్లో గళమెత్తి నా ప్రయోజనం లేకుండా పోయింది. పట్టణంలో భూఆక్రమణలు, కబ్జాలు జరిగినా పట్టించుకోవడం లేదని కౌన్సిల్ కన్నెర్ర చేసినా.. పట్టణ ప్రణాళిక అధికారులు అటువైపు కన్నెత్తి చూసింది లేదు. కొత్తగా నిర్మాణాలు చేపట్టిన వాటికి ఇంటి నంబర్లు కేటాయించడంలో అలసత్వం వహిస్తూ.. మున్సిప ల్ ఆదాయానికి గండి కొడుతున్నారు.
అవినీతి.. అక్రమాలకు నెలవు
ఇంజనీరింగ్ విభాగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నలుగురు డీఈలు, ముగ్గురు ఏఈలు బదిలీలు, డిప్యుటేషన్లపై వెళ్లగా.. కొందరు తిరిగి ఇక్కడికే పోస్టింగ్ వేయించుకున్నారు. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, భవన నిర్మాణాల్లో నాణ్యత గాలికి వదిలేశారు. నిలువునా పగిలిన సీసీరోడ్లు.. ఎక్కడికక్కడ కూలిపోతున్న డ్రెయినేజీలే ఇందుకు నిదర్శనం. నాసిరకం పనులపై ఆరోపణలు వెల్లువెత్తినా.. బిల్లుల చెల్లింపు మాత్రం ఆగలేదు. సెంట్రల్ లైటింగ్ సిస్టం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో బల్బులు వెలగడం లేదు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం గతంలో పని చేసిన మహిళా కమిషనర్ ఏసీబీకి పట్టుబడిందంటే.. ఇక్కడ ఏ మేరకు మామూళ్ల బాగోతం జరుగుతున్నతో అర్థం చేసుకోవచ్చు. ఇక శానిటేషన్ విషయానికొస్తే నిర్వహణ అధ్వానంగా మారింది. ప్రధాన రహదారుల్లోని డ్రెయినేజీలు, నాలాలు చెత్తా చెదారంతో నిండి పట్టణ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో పెద్ద కుంభకోణం చేశారు. పురపాలిక వాహనాలకు కనీసం రిజిస్ట్రేషన్ చేయించే ఆలోచన కూడా అధికారులకు లేకుండా పోయింది.
కనిపించని అభివృద్ధి
ఈ ఐదేళ్ల కాలంలో జనగామలో అభివృద్ధి జరిగింది అంతంత మాత్రమే. హనుమకొండ రోడ్డులో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన మోడల్ మార్కెట్‌లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. శ్మశాన వాటికల అభివృద్ధిని గాలికి వదిలేశారు. చేపట్టిన పనులు సైతం నాసిరకంగా ఉన్నాయి. వర్షాకాలంలో పలు కాలనీలు నీట మునిగిన సమయంలో భవిష్యత్‌లో పునరావృతం కానివ్వమని చెబుతున్న అధికారులు, పాలకుల మాటలు నీటి మూటలుగా మారాయి.
పట్టణంలో వార్డులు : 30
– జనగామ
Comments
Please login to add a commentAdd a comment