ఆదివారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2025
ఆకట్టుకునే పల్లె వాతావరణం
సినిమాల చిత్రీకరణకు అనుకూలం
ప్రభుత్వం దృష్టి సారిస్తే షూటింగ్ స్పాట్
చారిత్రకమే కాదు.. అందమైన బహు సుందరనగరం ఓరుగల్లు. ఈప్రాంతంలో తీసిన ఎన్నో సినిమాలు బంపర్‌హిట్ కొట్టాయి. కొంత మంది దర్శకులైతే వరంగల్‌కు సంబంధించి తమ సినిమాలో ఒక్కసీన్ అయినా ఉండాలని కోరుకుంటారు. లెక్కలేనన్ని సినిమాలు ఈ ప్రాంతం నేపథ్యంలో వచ్చాయి. టాలీవుడ్‌లో హైదరాబాద్ తర్వాత అంతటి స్కోప్ ఉన్న సిటీ వరంగల్. ఇక్కడి అందాల్ని కళ్లకు కట్టినట్లుగా దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇక్కడి షూటింగ్ హాట్‌స్పాట్ అయిన ఖిలా వరంగల్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– ఖిలా వరంగల్
20 ఏళ్ల.. ‘వర్షం’
ఇరవై ఏళ్ల క్రితం వరంగల్ ప్రాంతంలో చిత్రీకరించిన వర్షం సినిమా రెండు రాష్ట్రాల్లో 200 రోజులు ఆడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిషపై పలు సన్నివేశాలు కోటలో చిత్రీకరించారు. ఆతర్వాత వందలాది తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, సీరియల్స్‌ను ఖిలావరంగల్ ప్రాంతంలో చిత్రీకరించారు. రాణిరుద్రమాదేవి సినిమాను సైతం కొంత భాగం ఇక్కడే తెరకెక్కించారు.
వరంగల్ గడ్డపై పుట్టిన దర్శకులు, నటులు జైనీ ప్రభాకర్, కరాటే ప్రభాకర్, సంగ కుమార్, గడ్డం సుధాకర్, గణేశ్ ఈ ప్రాంత వైభవాన్ని చాటుతూ.. అనేక చిత్రాలు నిర్మించారు. ‘నేనే సరోజన’ సినిమాను పాకల శారద, సదానందం రచయిత, నిర్మాతగా ఈపరిసరాల్లో షూట్ చేశారు. గతేడాది డిసెంబర్‌లో ‘ఓ రామా, అయ్యోరామ’ సినిమా షూటింగ్.. జరిపారు. సుహాస్, మాళవిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలు కోటలో చిత్రీకరించారు.
వేలాది మందికి ఉపాధి
ఓరుగల్లు నగరం కళలకు పుట్టినిల్లే కాదు.. వివిధ భాషల్లో రూపుదిద్దుకున్న ఎన్నో సినిమా విజయాల్లోనూ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే చాలు.. సినిమా హిట్ అవుతుందని నమ్మే కథానాయకులు, నిర్మాతలు, దర్శకులు చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. చారిత్రక రాతి, మట్టికోట కట్టడాలు, రాతికోట చుట్టూ జలాశయం వంటి సుందర ప్రదేశాలు. మరెన్నో అందాలకు నెలవైనది ఈకళారాజ్యం. నల్లరాతిలో చెక్కిన అద్భుత కళా ఖండాలు కనువిందు చేస్తున్నాయి.
ఇక్కడేముందంటే..
ఉమ్మడి జిల్లాలో సినీ చిత్రీకరణకు ఎన్నో అనువైన ప్రదేశాలున్నప్పటికీ ఖిలావరంగల్ కోటను ప్రథమంగా చెప్పుకోవాలి. ఇక్కడి ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. రాతి శిల్పాలైతే చూపు తిప్పనివ్వవు. పురాతన కట్టడాలు, రాజ ప్రాకారాలు, కోటలు, రాజులు వినియోగించిన ఖుష్ మహల్, ఏకశిల కొండ ఇవన్నీ మైమరిచిపోయేలా చేస్తాయి. కనువిందు చేసే ఏకశిల కొండ, విశాలమైన జలాశయం, బోటు షికారు, చుట్టూ పచ్చని సిరుల పంటలు. పల్లెటూరి వాతావరణం.. వెరసి ప్రకృతి రమణీయతకు ఇక్కడి ప్రాంతం పెట్టింది పేరుగా చెప్పవచ్చు.
టూరిజం స్పాట్‌గా వెలుగొందుతున్న ఈప్రాంతంపై పాలకులు దృష్టి సారిస్తే టాలీవుడ్‌లో హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఎక్కువ షూటింగ్‌లు జరిగే అవకాశం ఉంది. వైభవానికి పెట్టింది పేరు.. కాకతీయుల రాజధాని చుట్టూ 7 కిలోమీటర్లు మట్టి కోట, 4.5 కిలోమీటర్ల పరిధిలో రాతికోట విస్తరించి ఉంటుంది. రాతికోట చుట్టూ ఉన్న నాలుగు దర్వాజలను (1 బండి దర్వాజ, 2, మచ్లీ, 3వ సీనా, 4వ హైదర్) పేర్లతో పిలుస్తారు. 75 బురుజులతో, నల్లరాతితో నిర్మించిన ఈకోట వైభవానికి పెట్టింది పేరుగా చెప్పవచ్చు. ఈ ద్వారాల వద్ద అనేక సినిమాలను చిత్రీకరించారు. లఘు చిత్రాల షూటింగ్‌లైతే లెక్కేలేదు.
షూటింగ్‌కు అనువైన స్థలం
త్రికోటలో కంటికి కనిపించని సుందరమైన ప్రదేశాల ఎన్నో దాగి ఉన్నాయి. అపూర్వమైన నిర్మాణాలు, ప్రాచీన కట్టడాలను, రాతికోట అందాలను కాకతీయుల వైభవాన్ని నా సినిమాల్లో చూపించాను. ప్రజల ఆదరణ తో సినిమా హిట్ అయ్యింది. ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.
– కరాటే ప్రభాకర్, ప్రేమిస్తే ప్రాణమిస్తా హీరో, చిత్ర నిర్మాత
ఇక్కడే చిత్రీకరించాలన్నది నా సెంటిమెంట్
ఖిలా వరంగల్‌లో సినిమా తీస్తే హిట్ అవుతుందన్నది నా సెంటిమెంట్. అందుకే నా ప్రతీ సినిమాలో ఒక్క సీన్ అయినా ఈ ప్రాంతంలోనిది ఉంటుంది. 2014లో హిట్ కొట్టిన ‘ఆట మొదలైంది’ సినిమా కొంత వరకు ఇక్కడే షూటింగ్ పూర్తి చేసుకుంది. 15 చిత్రాల్లో హీరోగా.. మరో పది చిత్రాల్లో సెకెండ్ హీరో పాత్ర పోషించా. నేను తీసిన సినిమాలకు దర్శక నిర్మాతగా నేనే వ్యవహరించా. బాక్స్, నర్సింహా ఐపీఎస్, పౌరుశం, నైస్ గాయ్, తదితర 15 చిత్రాలు కోటలోనే తీసి ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నా.
– సంగ కుమార్, సినీనటుడు, తూర్పు కోట వరంగల్
Comments
Please login to add a commentAdd a comment