ఆశ చూపి.. కొల్లగొట్టి
జనగామ: ‘పెట్టుబడికి రెండు రెట్ల ఆదాయం.. కార్లు, బైక్‌లు వస్తాయి.. ఒక్క యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీ భవిష్యత్ బంగారుమయం’ అంటూ ‘కోస్టా’ యాప్ పేరిట నిర్వాహకులు అమాయకుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు. విస్తృతంగా ప్రచారం చేపట్టి.. కార్పొరేట్ కంపెనీని తలదన్నే రీతిలో ఫంక్ష న్ నిర్వహించగా.. అత్యాశతో వేలాది మంది యాప్ లో పెట్టుబడులు పెట్టారు. తీరా నిర్వాహకులు బిచానా ఎత్తివేయడంతో మోసపోయినట్లు తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. యాప్‌ను పరిచయం చేసిన ఏజెంట్లను నిలదీయగా వారు ఎదురు తిరగడంతో శనివారం పోలీసులను ఆశ్రయించారు. బాధితులు కె.రాజు, ఇ.జగీదీష్, ఎస్.ప్రశాంత్, జి.భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
2వేల మంది.. రూ.15కోట్లు
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 2వేల మంది.. రూ.15కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా దేశం మెల్‌బోర్న్‌కు చెందిన కోస్టా యాప్‌ను జిల్లాకు నాలుగు నెలల క్రితం పరిచయం చేశారు. పట్టణానికి చెందిన శ్రీధర్ యాదవ్, ఇక్రమొద్దీన్ కంపెనీ ఏజెంట్లుగా యాప్ గురించి ప్రచా రం చేశారు. గత ఏడాది డిసెంబర్ చివరి ఆదివారం యశ్వంతాపూర్ శ్రీ సత్యసాయి కన్వెన్షన్‌లో వేడుకలు నిర్వహించగా.. జిల్లా నలుమూలల నుంచి 600 మందికిపైగా హాజరయ్యారు. కోస్టా యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుబడులు పెడితే ఒకటికి రెండు రెట్ల ఆదాయం వస్తుందని నమ్మించారు. ఫ్రూట్స్ పేరిట కేటగిరీలను విభజించి రోజువారీ లాభాలు వస్తాయని వివరించారు. రూ.19వేల పెట్టుబడి పెట్టిన వారికి 52 రోజుల పాటు రోజుకు రూ.893 చొప్పున రూ.46,636 వస్తాయని లెక్కలు వేసి చూపించారు. ఇలా రూ.67వేలు, రూ.39వేలు, రూ.97వేలుగా విభజించి కోస్టా యాప్ ద్వారా కలెక్షన్ చేశారు. కొంతమంది ఖాతాల్లో మూడు, నాలు గు రోజుల పాటు డబ్బులు వేయగా.. చాలా మంది ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత ఖాతాల్లో డబ్బు జమకాకపోవడంతో బాధితులు ఏజెంట్లను సంప్రదించగా కేంద్రం నిబంధనల మేరకు ట్యాక్స్ సమస్య వస్తుందని చెబుతూ వచ్చారు. ఈ సమస్య కు పరిష్కారంగా రూ.3వేలు, రూ.9వేలు, రూ.15వేలు, రూ.25వేల ట్యాక్స్ కార్డు తీసుకుంటే మొదట పెట్టుబడి పెట్టిన డబ్బులకు రెట్టింపు వస్తాయని నమ్మించారు. దీంతో చాలా మంది వడ్డీలకు తీసుకొచ్చి చెల్లించారు. బాధితుల్లో కొందరు సమస్యను పోలీస్‌స్టేషన్ వరకు తీసుకెళ్లగా.. మెజారీ బాధితులు పరువు పోతుందనే భయంతో మిన్నకుండి పో యారు. జిల్లాలో సుమారు 2వేల మంది రూ.4వేల నుంచి రూ.7లక్షల వరకు మొత్తం రూ.15కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.
కార్లు, బైకులు వచ్చాయని..
కోస్టా యాప్ పరుగులు పెడుతోందని ఫంక్షన్లు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తూ ఏజెంట్లు ప్రచారాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లారు. శ్రీ సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగిన వేడుకల్లో పలువురికి నజరానాగా కార్లు, బైక్‌లు వచ్చాయని నమ్మించా రు. కంపెనీ ప్రతినిధుల చేతుల మీదుగా తీసుకున్న ట్టు నటించి మోసం చేశారని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రోగులకు పండ్లు పంపిణీ చేసిన చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ప్రధాన గేటు వద్ద కోస్టా యాప్ గురించి ఫ్లెక్సీతో ప్రచారం చేయడం గమనార్హం.
‘కోస్టా’ యాప్ పేరిట మోసం
పెట్టుబడికి రెండురెట్లు వస్తాయని బురిడీ
కార్లు, బైకులు వస్తున్నాయని
నమ్మించిన ఇద్దరు ఏజెంట్లు
2వేల మంది నుంచి రూ.15కోట్ల వసూలు
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఆన్‌లైన్ మోసాలకు
దూరంగా ఉండాలి : ఏఎస్పీ
ఆన్‌లైన్ యాప్‌ల పేరిట అనధికారిక వ్యక్తులు చెప్పిన మాటలు విని మోసపోవద్దని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ అన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ దామోదర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జనగామకు చెందిన శ్రీదర్ యాదవ్, ఇక్రమొద్దీన్ కోస్టా యాప్‌కు ఏజెంట్లుగా వ్యవహరించి మోసం చేశారని బాధితులు కె.రాజు, ఇ.జగదీష్, ఎస్.ప్రశాంత్, జి.భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. యాప్ నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టి బాధితుల సంఖ్య, ఎంత డబ్బు నష్టపోయారనే విషయం తెలుసుకుంటామని చెప్పారు. స్మార్టు ఫోన్లలో వచ్చే లింకులు, అనధికార యాప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టా..
గత ఏడాది డిసెంబర్ చివరి ఆదివారం యశ్వంతాపూర్ శ్రీ సత్యసాయి కన్వెన్షన్‌లో కోస్టా యాప్ ప్రమోట్ ఫంక్షన్ నిర్వహించారు. మమ్మల్ని కూడా ఆహ్వానించారు. సుమారు 600 మంది వరకు వచ్చారు. రెట్టింపు డబ్బులు వస్తాయని జనగామకు చెందిన ఏజెంట్లు శ్రీధర్‌యాదవ్, ఇక్రమొద్దీన్ నమ్మించి నాతో రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టించారు. మూడు రోజుల పాటు రూ.30వేల వరకు ఖాతాలో జమయ్యాయి. ఆ తర్వాత రాకపోవడంతో ఏజంట్లను అడిగితే సంక్రాంతి తర్వాత అన్నారు. అప్పుడు కూడా విత్ డ్రా ఆప్షన్ కనిపించక పోవడంతో అడగ్గా దాడి చేసేందుకు వచ్చారా అంటూ బెదిరించడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. – కె.నాగరాజు టైల్స్ షాప్ యజమాని, జనగామ
Comments
Please login to add a commentAdd a comment