శాంతిభద్రతలను పరిరక్షించాలి
బచ్చన్నపేట : ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను పరిరక్షించాలి.. విఘాతం కలిగిస్తే నేరస్తులవుతారని జనగామ ఏసీపీ నితిన్ చేతన్ అన్నారు. శనివారం ఆయన.. పోచన్నపేటలో నూతనంగా నిర్మించనున్న పెట్రోల్ పంపు స్థలాన్ని పరిశీలించాక పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నేటి యువత చేస్తున్న పనులను వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలని, చెడు వ్యసనా లకు అలవాటు పడకుండా చూడాలని చెప్పా రు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని, హెల్మెట్ తప్పకుండా ధరించాలని అన్నారు. స్టేషన్‌కు వచ్చే వారి సమస్యలను పోలీసులు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఎస్‌కే.అబ్దుల్ హమీద్, కానిస్ట్టేబుళ్లు పాల్గొన్నారు.
హుండీ ఆదాయంరూ.41,44,248
పాలకుర్తి టౌన్: శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.41,44,248 వచ్చినట్లు ఈఓ మోహన్‌బాబు తెలిపారు. 2024 మార్చి 27 నుంచి 2025 జనవరి 17 వరకు భక్తులు సమర్పించిన కానుకలను శనివారం ఆలయ కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఎన్.సంతోష్‌రెడ్డి పర్యవేక్షణలో లెక్కించారు. అమెరికా, ఇంగ్లండ్, యూరప్, సింగపూర్, ఆస్టేలియా కరెన్సీ వచ్చినట్లు ఈఓ పేర్కొన్నా రు. లెక్కింపులో అర్చకులు, సిబ్బందితోపాటు కేజీవీబీ సిబ్బంది, మహబూబాబాద్‌కు చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు.
బీసీలకు కార్పొరేషన్
సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
స్టేషన్‌ఘన్‌పూర్: నిరుద్యోగ బీసీ యువతకు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయకుమార్ డిమాండ్ చేశారు. శనివారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొయ్యడ రమేశ్ అధ్యక్షతన స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న బీసీ, ఎంబీసీ, సంచార జాతుల్లోని కులాలను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో యువకులకు వ్యక్తిగత సబ్సిడీ రుణం రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అర్హులందరికీ వ్యక్తిగత రుణాలు ఇవ్వాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొయ్యడ వెంకటయ్య, దామెర రాజారామ్, దామెర రాజు తదితరులు పాల్గొన్నారు.
అండర్‌పాస్
ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: పట్టణ పరిధి బాణాపురంలో అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన శనివారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు ఇరిగేషన్ ఏఈ స్వప్నకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కనకారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చొరవ తీసుకొని 15 గ్రామాలకు ఉపయోగపడేలా అండర్ పాస్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. స్పందించిన ‘పల్లా’ ఎన్‌హెచ్ అధికారులు, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, భువనగిరి ఎంపీ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు బొట్ల శేఖర్, బూడిద గోపి, జోగు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment