గద్వాలటౌన్: కలెక్టర్ సంతోష్ పట్టణంలో కలియతిరిగి వివిధ అభివృద్ది పనులను పరిశీలించారు. బుధవారం మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకొని రెండు గంటల పాటు నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నది ఆగ్రహారంలో తాగునీటి పథకం కింద చేపట్టిన ఫిల్టర్‌బెడ్‌ను సందర్శించి, అందులో ఉన్న అన్ని విభాగాలను పరిశీలించారు. అమృత్ 2.0 పథకం కింద ప్రతిపాదిత కొత్త వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 5 ఎంఎల్‌డీ సామర్థ్యాంతో చేపట్టే ఓవర్ హెడ్ ట్యాంకు పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబారీ టౌన్‌షిప్ పనులను పరిశీలించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం హామీ నిధుల కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. నల్లకుంట కాలనీలో చేపడుతున్న మల్టీపర్పస్ ఆడిటోరియం పనులను పరిశీలించి, ప్రహరీ నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. తేరుమైదానం, కృష్ణవేణి చౌరస్తాలలో ఉన్న అండర్ గ్రౌండ్ వర్షపు నీటి కాలువను పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ మల్లేష్, ఏఈ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment