వేరుశనగ క్వింటా రూ. 6,989
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 1,381 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. క్వింటా గరిష్టంగా రూ. 6,989, కనిష్టంగా రూ. 3,099, సరాసరి రూ. 5,169 ధర పలికింది. 10 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 5,519, కనిష్టంగా రూ. 5,309, సరాసరి రూ. 5,389 ధరలు లభించాయి. 557 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,392, కనిష్టంగా రూ. 1,700, సరాసరి రూ. 1,581 ధరలు పలికాయి. 303 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ.7,559, కనిష్టంగా రూ. 2,689, సరాసరి రూ. 7,119 ధరలు వచ్చాయి.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: కార్మికుల పిల్లలకు ప్రతిభా ఆధారంగా అందించే స్కాలర్‌షిప్‌లకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్మికశాఖ ఏఎల్‌సీ మహేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుకాణాలు, వాణిజ్య, సహకార సంస్థలు, ధార్మిక, ఇతర ట్రస్టుల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు 2023–24 విద్యా సంవత్సరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి ఉండాలని.. అర్హులైన వారు ఫిబ్రవరి 15వ తేదీలోగా జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర కార్మిక సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ పథకంలో 10వ తరగతి, ఐటీఐలో ప్రతిభ కనబర్చిన వారికి రూ.1,000, పాలిటెక్నిక్‌లో ప్రతిభ చాటిన వారికి రూ. 1,500, ఇంజినీరింగ్, వైద్య, నర్సింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, బీసీఏ, ఎంసీఏ, బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ, బీబీఏఎం, ఎంబీఏ, డిప్లోమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి రూ. 2వేల వరకు స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మే డే నాటికి అర్హులైన వారి బ్యాంకు ఖాతాలో స్కాలర్‌షిప్‌లను జమ చేస్తామన్నారు.
డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయాలి
గద్వాల: యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మాదకద్రవ్యాల నియంత్రణ, వాటి దుష్ప్రభావాలపై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కమిటీలు ఏర్పాటు చేసి.. మాదకద్రవ్యాల వైపు విద్యార్థులు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రవర్తన తీరును పరిశీలించాలని తెలిపారు. మారుమూల గ్రామాలు, సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఇంటర్మీడియట్ అధికారి హృదయరాజు, డీడబ్ల్యూఓ సునంద, ఎకై ్సజ్ శాఖ సీఐ గణపతిరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment