బీఆర్‌ఎస్ ఒక్క ఎకరాకు నీళ్లివ్వలే..
నాగర్‌కర్నూల్/ తిమ్మాజిపేట/ బిజినేపల్లి: ‘తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీటి కోసం.. అలాంటిది బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు.. రాష్ట్రంలో ప్రస్తుతం నీరందిస్తున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే.. ఉమ్మడి పాలమూరు జిల్లాను తెలంగాణ కోనసీమగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతుందన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించిన ఆయన.. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపలి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లిలో మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రూ.38 వేల కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు ప్రాజెక్టు పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దానిని తమ ప్రభుత్వం ఐదేళ్లలోనే పూర్తిచేసి చూపిస్తుందన్నారు. కేఎల్‌ఐ పెండింగ్ పనులను పూర్తిచేస్తామని, కృష్ణానది వాటాలో ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించడానికి ఖర్చుకు వెనకాడమని స్పష్టం చేశారు.
నిర్వాసితులను ఆదుకుంటాం..
నార్లాపూర్ భూ నిర్వాసితులకు గత ప్రభుత్వం జీఓ 123 ద్వారా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసిందని మంత్రి విమర్శించారు. ‘పాలమూరు’ భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని, ముంపు గ్రామాలకు సంపూర్ణంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. భూ సేకరణలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర, చిన్నకేశవ ఎత్తిపోతలను తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్కండేయ ఎత్తిపోతలకు మొదట రూ.76 కోట్లు కేటాయించి.. తర్వాత రీడిజైన్ పేరుతో రూ.86 కోట్లకు పెంచిందన్నారు. అందులో రూ.6 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని.. పథకం పనులకు కేవలం రూ.4 కోట్లు మాత్రమే విడుదల చేసి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో ఈ పథకానికి నిధులు కేటాయించి పూర్తి చేశామన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలని సూచించారు. రైజింగ్ తెలంగాణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, విద్యుత్‌శాఖ సీఎండీ ముషారఫ్ అలీ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణాలు
పాలమూరును తెలంగాణ
కోనసీమగా మారుస్తాం
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి యాక్షన్ ప్లాన్
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Comments
Please login to add a commentAdd a comment