మహిళలందరూ ఒకచోట చేరి పిండి వంటలు చేసుకోవడం పండగ ప్రత్యేకత. సకినాలు, అరిసెలు, కారపూస, జంతికలు, నువ్వుల ఉండలు, గారెలు చేస్తుంటారు. ఇప్పటికే పల్లెల్లో పిండి వంటల తయారీ పూర్తయింది. ఉద్యోగాలు, చదువుల కోసం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఉన్న వారంతా పండగకు ఇంటికి వచ్చారు. ఆంధ్రపదేశ్‌లోని గోదావరి తీరంలో సంక్రాంతి పండగ వేడుకలను ఆస్వాదించడానికి కొందరు యువత ఆంధ్రాకు పయనమయ్యారు.
ముత్యాల ముగ్గులు..
సంక్రాంతి ప్రారంభానికి ముందు నుంచే ముగ్గుల సందడి మొదలైంది. సూర్యోదయానికి ముందే మహిళలు నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముచ్చటైన ముగ్గులు వేయడంలో పోటీ పడతారు. సృజనాత్మకతకు రంగవల్లులనే వేదికగా చేసుకుంటారు. మార్కెట్‌లో రంగుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి రంగుల కొనుగోలుదారులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నాయకులు, పాఠశాలల్లో వేర్వేరుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్సాహపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment