అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
గద్వాల: మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా, నాణ్యతగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో చేపడుతున్న అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన స్టోరేజీ రిజర్వాయర్ నీటి సరఫరా పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. 15వ ఫైనాన్స్, సీఎం అష్యూరెన్స్ ఫండ్, జనరల్ ఫండ్ ఇతర మున్సిపల్ నిధులతో ఇప్పటికే చేపట్టిన పనులన్నింటినీ నిర్ణీత సమయంలో చేపట్టాలన్నారు. గద్వాల మున్సిపాలిటీలో ఆడిటోరియం, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కమ్యూనిటీ హాల్స్ వంటి పనులు వెంటనే ముగించాలన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు, విద్యుత్ చార్జీలు జనరల్ ఫండ్ ద్వారా వారం రోజుల్లో చెల్లించాలన్నారు. సీఎం అష్యూరెన్స్ మిగులు నిధులతో సమ్మర్ వాటర్ ప్లాన్ కింద వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ నిధులతో అవసరమైన చోట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment