No Headline
గద్వాల టౌన్ : నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. తల్లిదండ్రులు సైతం ఆ దిశగా పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. పల్లె, పట్టణం తేడా లేకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను నవోదయలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి ప్రవేశం లభిస్తే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు అందులోనే నాణ్యమైన విద్య అందుతుంది. క్రీడలకూ ప్రాధాన్యం ఉంటుంది. వసతి, భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, ఏకరూప దుస్తులు తదితర అన్నీ కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరులోని ఏకై క పాఠశాల పాలెం నవోదయ పాఠశాల 6వ తరగతిలో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తుండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ (రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కొన్ని మండలాలు) జిల్లావ్యాప్తంగా 6,602 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే 80 సీట్లకు ఇంత మంది పోటీ పడాల్సి వస్తోంది. ఈ మేరకు శనివారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అరగంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో..
తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కొత్త నవోదయ విద్యాలయాలు వస్తే పోటీ తగ్గి ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం వస్తుందని అనేక మంది చాలా కాలంగా ఎదురుచూశారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో కొత్త నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం మహబూబ్‌నగర్ శివారులో స్థల పరిశీలన చేశారు. అయితే ఇందులో ఏయే జిల్లాల విద్యార్థులకు అవకాశం ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది కొత్త నవోదయ విద్యాలయంలో సీట్లు భర్తీ చేసి విద్యాలయాన్ని అందుబాటులోకి తేస్తారా.. లేదా.. అనేది స్పష్టత లేదు. ఒకవేళ ఈ ఏడాది కొత్త విద్యాలయం కొనసాగకపోతే పాత జిల్లాలనే పరిగణలోకి తీసుకొని విద్యార్థులు ఈ ఏడాది కూడా సీట్ల కోసం తీవ్ర పోటీ పడాల్సిందే. కొత్త విద్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తే పోటీ తగ్గడంతోపాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆ దిశగా పాలకులు, అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
అరగంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతి
ఉమ్మడి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో దరఖాస్తులు
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం
కొత్త విద్యాలయం అందుబాటులోకి వస్తేనే ప్రయోజనం
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..
జిల్లా పరీక్ష పరీక్ష రాసే
కేంద్రాలు విద్యార్థులు
మహబూబ్‌నగర్ 5 1,260
నాగర్‌కర్నూల్ 8 1,990
జోగుళాంబ గద్వాల 4 967
వనపర్తి 5 1,145
నారాయణపేట 3 696
రంగారెడ్డి 1 329
వికారాబాద్ 1 215
Comments
Please login to add a commentAdd a comment