సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మెట్టుగడ్డ: ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు అంతంతమాత్రంగానే ఆదాయం సమకూరింది. 2023 (ఏప్రిల్–డిసెంబర్)తో పోలిస్తే 2024లో రాబడి గణనీయంగా 36.29 శాతం మేర తగ్గింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సైతం రిజిస్ట్రేషన్ విలువను ఎప్పటికప్పుడు పెంచుతూ పోయింది. దీంతో స్థిరాస్తుల క్రయవిక్రయాలు పెరుగుతాయని.. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని పాలకులు భావించారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. హైదరాబాద్ పరిధిలో అనధికార కట్టడాలు, లేఔట్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. హైడ్రా పేరిట కూల్చివేతలు చేపట్టడం.. జిల్లా స్థాయిలో కూడా యంత్రాంగం ఏర్పాటు చేసేలా ముందుకు సాగుతుండడంతో ప్రజల్లో ఏవి అక్రమ కట్టడాలు.. ఏది కొంటే ఏమవుతుందోననే భయం నెలకొన్నట్లు తెలుస్తోంది.
తగ్గిన రిజిస్ట్రేషన్లు..
ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో ఇళ్లు, ప్లాట్ల వంటి స్థిరాస్తి లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. అయితే 2023 (ఏప్రిల్–డిసెంబర్)తో పోలిస్తే 2024లో రిజిస్ట్రేషన్ దస్తావేజులు తక్కువగా రాగా.. అంతంత మాత్రంగానే ఆదాయం సమకూరింది. 2023లో 72,666 రిజిస్ట్రేషన్లు కాగా.. 2024లో 70,030 మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన 2,636 రిజిస్ట్రేషన్ దస్తావేజులు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment