ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి
ఎర్రవల్లి: ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమ, నిబంధనలు పాటించాలని పదవ పటాలం అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీచుపల్లి పదో పటాలంలో జిల్లా ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది, సాయుధ చైతన్య పాఠశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి ఆయన హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నిత్య జీవితంలో తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని నినాదాలు చేయిస్తూ విద్యార్థులతో కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్నపాటి తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం తనవంతు బాధ్యతగా గుర్తించాలని సూచించారు. విద్యార్థులు రోడ్డు భద్రత గురించి కుటుంబ సభ్యులు, మిత్రులకు తెలియజేయాలన్నారు. హెల్మెట్ లేకుండా కుటుంబ సభ్యులు బైక్‌పై బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణం చేయరాదని చెప్పారు. అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని, నిర్లక్ష్యం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు వీధిన పడతాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాసులు, జిల్లా రవాణా శాఖాధికారులు కృష్ణారెడ్డి, రాములు, రమేష్‌కుమార్, పటాలం అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment