అన్నదాతకు వాయు‘గండం’
కాకినాడ సిటీ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అన్నదాతలను కలవరపరుస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇప్పటికే రెండుసార్లు ఏర్పడిన అల్పపీడనాలు రైతులను ఆందోళనకు గురి చేశాయి. గత నెల 29న అల్పపీడనం తుపానుగా మారి, దాని ప్రభావంతో నాలుగైదు రోజుల పాటు జోరుగా వర్షాలు కురడంతో రైతులు కొంత మేర నష్టపోయారు. ఈ నెల 8న ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఐదారు రోజుల పాటు వానలు కురిశాయి. ఖరీఫ్‌లో ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు కోతలకు సమాయత్తం కాగా.. నాటి వర్షాల కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడనం వాయుగండంగా మారనుందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సార్వా చివరి దశలో ఉన్న కొంత మంది రైతులు నాలుగు రోజులుగా వరి కోతలు నిలిపివేశారు. ఇలా నెల రోజులుగా సార్వా కోతలు కోయాలన్నా, మాసూళ్లు ప్రారంభించాలన్నా దినదినగండం అన్నట్టుగానే రైతుల పరిస్థితి మారింది. కొందరు ధైర్యం చేసి యంత్రాలతో కోతలు కోసినా, ధాన్యం సరిగ్గా ఆరక, తేమ శాతం తగ్గక తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోయారు. రోజుల తరబడి బరకాలు, పట్టాలు, టార్పాలిన్లు కప్పి ఉంచి ధాన్యం ఎండబెట్టుకోలేని దుస్థితిని ఎదుర్కొన్నారు.
ఆదరాబాదరాగా..
జిల్లాలో 96 వేల హెక్లార్లలో ఖరీఫ్ వరి సాగు జరగగా.. ఇప్పటి వరకూ 73 వేల హెక్టార్లలో మాసూళ్లు పూర్తయ్యాయి. ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు ఇప్పుడు కోతలకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రతికూల వాతావరణం వారిని కలవరపెడుతోంది. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచే వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై బుధ, గురువారాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో రైతులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండవచ్చనే ఆందోళనతో ధాన్యం రాశులను కాపాడుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. పట్టుబడి చేసిన ధాన్యం బస్తాలను ట్రాక్టర్లలో ఆదరాబాదరాగా సురక్షిత ప్రాంతాలకు, వీలైతే మిల్లులకు తరలిస్తున్నారు. కొంత మంది ధాన్యం రాశులపై రెండు మూడు పొరలు ప్లాస్టిక్ బరకాలు, దానిపై టార్పాలిన్లు కప్పారు.
కూలీలకు డిమాండ్
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ధాన్యం రాశులు పట్టడానికి, ఆరబెట్టిన ధాన్యం పోగు చేసి, బస్తాల్లో నింపడానికి, బస్తాలను సమీప రోడ్లు, పుంతలకు చేర్చడానికి, ఎండుగడ్డి ఒబ్బిడి చేయడానికి, గడ్డి మేటుగా వేయడానికి కూలీల అవసరం ఎక్కువగా ఏర్పడుతోంది. దీంతో రైతులకు కూలి ఖర్చులు రెట్టింపయ్యాయి. వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో నాలుగైదు రోజుల పాటు వరి కోతలు కోయరాదని, ఇప్పటికే నూర్చిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, భద్రపరచుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
ఫ నెల రోజుల్లో మూడోది
ఫ వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు
ఫ బెంబేలెత్తుతున్న రైతులు
ఫ చిరుజల్లులతో ఆందోళన
భయపెడుతున్న ముప్పు
వరి కోతలు కోసిన రైతులను వాయుగండం ముప్పు భయపెడుతోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆకాశం ముసురేసింది. కొన్ని ప్రాంతాల్లో కోతలు కోసి, కళ్లాల్లో రాశులు పోసిన రైతులు, కుప్పలు వేసిన వారు ధాన్యాన్ని కాపాడుకునేందుకు అగచాట్లు పడుతున్నారు. ప్రకృతి విపత్తుతో రైతులు నష్టపోకుండా, పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– రావుల ప్రసాద్, మాజీ పీఎసీఎస్ అధ్యక్షుడు, కరప
అప్రమత్తం చేశాం
వాయుగుండం నేపథ్యంలో రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు టార్పాలిన్లు అందజేశాం. ప్రతి రైతు నుంచీ ధాన్యం కొనుగోలు చేస్తాం. వారు ఏవిధంగానూ నష్టపోకుండా చర్యలు తీసుకునేలా మండల వ్యవసాయాధికారులను, రైతు కేంద్రాల సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఖరీఫ్ ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటి వరకూ 99,078 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.
– కె.విజయకుమార్, జిల్లా వ్యవసాయాధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment