రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. శనివారం సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజనం పెట్టారు.
ఆలస్యంగా ప్రాకార సేవ
ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో జరిగే సత్యదేవుని ప్రాకారసేవ ఈసారి గంట ఆలస్యంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పండితులు తిరుచ్చి వాహనంపై వేంచేయించి, పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఈఓ వి.సుబ్బారావు దంపతులు ప్రాకార సేవ ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రధానాలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ధనుర్మాసం సందర్భంగా కొండ ది గువన స్వామి, అమ్మవార్లను ఊరేగించడంతో ప్రాకారసేవ ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
కవి ఈరంకికి సత్కారం
తుని: తెలుగు ఉపాధ్యాయుడు, కవి ఈరంకి వీర వెంకట సత్య వరప్రసాద్‌ను ప్రముఖ సినీ రచయిత రసరాజు ఘనంగా సత్కరించారు. విజయవాడ ఏబీఎన్ కళాశాలలో శనివారం ప్రారంభమైన 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తుని పట్టణానికి వరప్రసాద్ పాల్గొన్నారు. తెలుగు నేల– తెలుగు భాష గొప్పతనంపై పద్యగానం చేసి, అందరినీ అలరించారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌ను సత్కరించారు. దేశవిదేశాల నుంచి ఎంతో మంది కవులు, రచయితలు, తెలుగు భాషాభిమానులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్న సభలో సన్మానం పొందడం ఆనందంగా ఉందని వరప్రసాద్ తెలిపారు.
కాకినాడలో వెంకటేష్ సందడి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ‘సంక్రాంతికి వచ్చేస్తున్నాం’ సినిమా యూనిట్ శనివారం రాత్రి కాకినాడలో సందడి చేసింది. పీఆర్ కళాశాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు. వారిని చూసేందుకు నగర ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సంక్రాంతి పండగకు ప్రేక్షకులను నవ్వించేందుకే ‘సంక్రాంతికి వచ్చేస్తున్నాం’ చిత్రం విడుదల చేస్తున్నామని వెంకటేష్ చెప్పారు. ఈ కుటుంబ కథా చిత్రం అందరీని నవ్విస్తుందని అన్నారు.
బాలాజీ దర్శనానికి
పోటెత్తిన భక్తులు
మామిడికుదురు: అప్పనపల్లిలో కొలువైన బాల బాలాజీ స్వామి దర్శనానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామున తొలి హారతి, మేలు కొలుపు సేవలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసంలో భాగంగా గోదావరి నుంచి జలాలు తీసుకు వచ్చి గోదాదేవితో పాటు బాల బాలాజీ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామి వారి సన్నిధిలో నిత్యం నిర్వహించే లక్ష్మీనారాయణ హోమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. గోశాలను సందర్శించి గోవులకు పూజలు చేశారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2.12,910 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు 65,750 విరాళాలుగా అందించారన్నారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.39,780 ఆదాయం వచ్చిందన్నారు. 3,518 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని, 2,429 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment