పుస్తకాలు, తువ్వాళ్లు, కాస్మెటిక్స్ తీసుకురండి
కాకినాడ సిటీ: నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే జిల్లా అధికారులు, ఉద్యోగులు, అభిమానులు, ప్రజలు, నాయకులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని కలెక్టర్ షణ్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం నుంచి కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటానన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలతో పాటు తువ్వాళ్లు, కాస్మెటిక్స్, స్నానం సబ్బులు, టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్, షాంపూలు, పుస్తకాలు, పెన్నులు మాత్రమే తీసుకుని రావాలని కోరారు.
నేడు పింఛన్ల పంపిణీ
కాకినాడ సిటీ: వచ్చే నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంగళవారమే పంపిణీ చేయనున్నామని కలెక్టర్ షణ్మోహన్ సోమవారం తెలిపారు. జిల్లాలో 2,73,202 మంది లబ్ధిదారులకు రూ.116.08 కోట్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదార్ల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో 261 మందికి స్పౌజ్ పింఛన్లు అందిస్తామన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 286 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 286 అర్జీలు అందించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, కేఎస్‌ఈజెడ్ ఎస్‌డీసీ కేవీ రామలక్ష్మి, సీపీఓ పి.త్రినాథ్ తదితర అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. వీటికి సంబంధించి అర్జీదారుకు సంతృప్తికర పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కాకినాడ రోడ్డు బాగు
చేయకుంటే ఆమరణ దీక్ష
సామర్లకోట: కాకినాడ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆలిండియా మాదిగ అభివృద్ధి సమాఖ్య (ఏఐఎండీఎస్) జాతీయ అధ్యక్షుడు కాపవరపు కుమార్ హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశానని ఆయన స్థానిక విలేకర్లకు తెలిపారు. సామర్లకోట నుంచి మాధవపట్నం శివారు వరకూ అడుగడుగునా రోడ్డు గోతులతో నిండిపోయి, ప్రతి రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. రాత్రి వేళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. సామర్లకోట – కాకినాడ రోడ్డుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే ఆమరణ దీక్షకు వెనుకాడే ప్రసక్తే లేదని కుమార్ స్పష్టం చేశారు.
2025కు స్వాగతం
పలుకుతూ మ్యాజిక్ చదరం
సామర్లకోట: నూతన ఆంగ్ల సంవత్సరం 2025కు స్వాగతం పలుకుతూ సామర్లకోట బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, గణితావధాని తోటకూర సాయిరామకృష్ణ తయారు చేసిన మ్యాజిక్ చదరం తయారు చేశారు. ఈ చదరంలో నిలువు, అడ్డు, కర్ణాలతో పాటు, రంగులు వేసిన ఏ నాలుగు అంకెలు కూడినా 2025 వస్తుందని సాయిరామకృష్ణ తెలిపారు. ప్రముఖుల పుట్టిన రోజులు, వర్ధంతులతో పాటు ప్రతి సందర్భంలో అనేక మ్యాజిక్ చదరాలను సాయిరామకృష్ణ తయారు చేస్తూంటారు. ఈ క్రమంలోనే 2025 సంవత్సరానికి సంబంధించి ఆసక్తికరమైన అంకెలతో చదరం తయారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment