కాకినాడ రూరల్: పాఠశాల విద్య అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీల (ఎస్‌ఎంసీ) సభ్యులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సర్వశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ పి.వేణుగోపాలరావు కోరారు. జిల్లాలోని పాఠశాల ఎస్‌ఎంసీలకు రమణయ్యపేట ఏపీఎస్పీ జెడ్పీ హైస్కూలులో సోమవారం ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఆయా మండలాల నుంచి ముగ్గురు టీచర్లు, ఇద్దరు ఎస్‌ఎంసీ చైర్మన్లు జిల్లా రీసోర్స్ పర్సన్లుగా (డీఆర్‌పీ) ఈ శిక్షణకు హాజరయ్యారు. వీరికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన టీచర్లు ఎస్‌ఎంసీల విధులు, బాధ్యతలు, బాలల హక్కుల పరిరక్షణ, కమిటీ సమావేశాల విధి విధానాలు, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, పాఠశాల సామాజిక తనిఖీ విధానం, పాఠశాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం, విద్యా సంబంధిత సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వేణుగోపాలరావు మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ పొందిన వారు మండల స్థాయి శిక్షణ అందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పర్యవేక్షకుడు ఇస్మాయిల్, కోర్సు డైరెక్టర్, సర్వశిక్షా జిల్లా కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి చామంతి నాగేశ్వరరావు, హెచ్‌ఎం గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక మంత్రి ఇలాకాలోనే
పేపర్ లీకేజీ మూలాలు
రామచంద్రపురం రూరల్: ఈ నెల 16న జరగాల్సిన సమ్మేటివ్–1 పరీక్ష గణితం పేపరు ముందు రోజే యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో 6 నుంచి 10వ తరగతి వరకూ నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, తీగ లాగితే.. జిల్లాలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం జెడ్పీ హైస్కూల్‌లో లీకేజీ తంతు జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ పాఠశాలలో సోషల్ సబ్జెక్టు బోధిస్తున్న ఉపాధ్యాయుడు తీపర్తి వెంకట సుబ్బారావును, ఎంఈఓ కార్యాలయంలో బఫర్ స్టాక్ నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించి, కస్టోడియన్‌గా ఉండే ఎంఈఓ మానుపూడి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని అమరావతి సైబర్ పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో పేపర్ లీకేజీ జరగడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment