పలువురికి కారుణ్య నియామకాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులకు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు శుక్రవారం కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల ఏడుగురు మరణించగా వారి వారసులను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ఖాళీలు ఏర్పడగానే ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కారుణ్య నియామకాలు చేపడుతున్నామని చైర్మన్ విప్పర్తి చెప్పారు. ఉద్యోగుల పదోన్నతులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులు కష్టపడి పని చేసి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.
6న జాబ్ మేళా
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈ నెల 6న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ మార్క్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలో జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగా లకు బీకాం, ఎంకాం, ఎంబీఏ, సీఏ, ఇంటర్ ఉత్తీర్ణులైన ఫ్రెషర్స్ అర్హులన్నారు. టాలీ, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ కోర్సులలో అవగాహన ఉన్న పురుష అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. వరుణ్ మోటార్స్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు, హోండా కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. వీరికి నెలకు రూ.12,800 నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్, భోజన, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు తమ కార్యాలయానికి విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని లచ్చారావు సూచించారు. వివరాలకు 77993 76111 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
295 మందికి
దేహదారుఢ్య పరీక్షలు
కాకినాడ క్రైం: కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా శుక్రవారం మహిళా అభ్యర్థిలనులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 295 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేరుగా పర్యవేక్షించారు. 180 మంది అభ్యర్థినులు తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment