శనివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2025
● నమో.. వేంకటేశా..
తుని రూరల్: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో చిత్రాన్నం(పులిహోర)తో.. విచిత్రాకృతిలో భక్తులకు కనువిందు చేశారు. గ్రామంలో కొలువు తీరిన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు, ధర్మకర్తలు శుక్రవారం తిరుప్పావడ సేవ, గోదాదేవి అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవలు నిర్వహించారు. తిరుప్పావడ సేవలో భాగంగా ఒకటిన్నర టన్నుల పులిహోరతో అర్చకులు స్వామివారి ప్రతిరూపాన్ని రూపొందించారు. బూరెలు, వివిధ రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో విశేషంగా అలంకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి మరీ స్వామి ‘చిత్రాన్న’ రూపాన్ని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధనలో వేలాదిగా భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. రాత్రి ఏడు గంటలకు నిర్వహించిన గోదాదేవి అమ్మవారి సహస్ర దీపాలంకార సేవలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ధర్మకర్తలు కంకిపాటి జమీలు, దాడిశెట్టి విష్ణుచక్రం, పోతుల వెంకట రమేష్, మేగాదుల సత్యనారాయణ, పన్నీరు బాబ్జీ, దండెం రామకృష్ణ, కాశపు వెంకట రమణ, పెదపూడి విష్ణు ఈశ్వరరావు, తూము రమణ, భక్తులు పాల్గొన్నారు.
10న ఉత్తర ద్వార దర్శనం
ఈ నెల పదో తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ధర్మకర్తలు తెలిపారు. ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి స్వామి, అమ్మవార్లను ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకోవచ్చన్నారు. 13వ తేదీ రాత్రి ఏడు గంటలకు గోదా రంగనాథుల దివ్య కల్యాణ మహోత్సవం విశేషంగా నిర్వహిస్తున్నామని, భక్తులు తరలిరావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment